హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. కేన్‌కు టెస్ట్‌ల్లో ఇది 33వ సెంచరీ. జేకబ్ బేతెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
కేన్ తన సెంచరీ మార్కును 137 బంతుల్లో అందుకున్నాడు. కేన్ సెంచరీలో 14 బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. కేన్ తన కెరీర్‌లో 105 టెస్ట్‌లు ఆడి 54.91 సగటున 33 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీల సాయంతో 9225 పరుగులు చేశాడు.
చరిత్ర సృష్టించిన కేన్ మామ
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో సెంచరీ చేసిన అనంతరం కేన్ మామ చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై ఐదు వరుస సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేన్ హ్యామిల్టన్ గడ్డపై వరుసగా ఐదు టెస్ట్ సెంచరీలు చేశాడు. హ్యామిల్టన్‌లో కేన్ సగటు 97.69గా ఉంది. ఇక్కడ కేన్ 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 1563 పరుగులు చేశాడు.
ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగిన రికార్డు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉంది. బ్రాడ్‌మన్ మెల్‌బోర్న్‌లో 128.53 సగటు కలిగి ఉన్నాడు. బ్రాడ్‌మన్ తర్వాత ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగి రికార్డు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో లక్ష్యణ్ సగటు 110.63గా ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. కేన్ మామ సెంచరీతో కదంతొక్కడంతో మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మూడో రోజు టీ విరామం సమయానికి న్యూజిలాండ్ 478 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ స్కోర్ 274/4గా ఉంది. కేన్ విలియమ్సన్ (123), డారిల్ మిచెల్ (18) క్రీజ్‌లో ఉన్నారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర (44) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. పాట్స్, అట్కిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జో రూట్ (32) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment