
'ఇకనైనా పూర్తిస్థాయి క్రికెట్ ఆడాలి'
మొహాలి:వరల్డ్ టీ 20లో తమ జట్టు ఇంకా పూర్తిస్థాయిలో గాడిలో పడలేదని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకూ ఆసీస్ రెండు మ్యాచ్లు ఆడినా వంద శాతం ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాన్నాడు. ప్రస్తుతం తమ దృష్టంతా తదుపరి మ్యాచ్ ల్లో విజయం సాధించడంపైనే ఉందని స్మిత్ తెలిపాడు.
'మేము పాకిస్తాన్తో పాటు భారత్తో లీగ్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ రెండూ నాణ్యమైన జట్లే. ఆ జట్లపై విజయం సాధిస్తే నేరుగా సెమీస్కు చేరతాం. ముందుగా శుక్రవారం పాకిస్తాన్తో ఆడాల్సిన మ్యాచ్పైనే దృష్టి పెట్టాం. మా జట్టు ఒత్తిడిలో ఉన్న మాట వాస్తవమే. దాన్ని అధిగమించి ముందుకు వెళ్లడమే మా కర్తవ్యం. ఇంకా పూర్తిస్థాయి ఆట ఆసీస్ జట్టు నుంచి రాలేదు. రాబోయే మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తాం' అని స్మిత్ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్లు తీసి ఆసీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపాపై స్మిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతను బ్యాట్స్మెన్ కదలికల్ని అర్ధం చేసుకుని బంతిని సంధించే తీరు నిజంగా అద్భుతమని కొనియాడాడు. రేపటి మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాట్స్మెన్కు జంపా నుంచి ముప్పు పొంచి వుందని ఈ సందర్భంగా స్మిత్ హెచ్చరించాడు.