
స్మిత్ అజేయ శతకం
‘డ్రా’ దిశగా ఆసీస్, పాక్ టెస్టు
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న రెండో టెస్టు ‘డ్రా’ దిశగా సాగుతోంది. మ్యాచ్ నాలుగో రోజు గురువారం ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 465 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (168 బంతుల్లో 100 బ్యాటింగ్; 9 ఫోర్లు) టెస్టు కెరీర్‌లో 17వ సెంచరీని పూర్తి చేసుకోగా, ఉస్మాన్ ఖాజా (165 బంతుల్లో 97; 13 ఫోర్లు) శతకం కోల్పోయాడు. స్మిత్, హ్యాండ్స్‌కొంబ్ (90 బంతుల్లో 54; 8 ఫోర్లు) కలిసి నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో సొహైల్, రియాజ్, యాసిర్ తలా 2 వికెట్లు తీశారు. ఈ సంవత్సరం నాలుగు సెంచరీలు చేసిన స్మిత్, వరుసగా మూడో ఏడాది టెస్టుల్లో వేయి పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం.
వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను ముందే నిలిపేశారు. ఈ టెస్టులో వరుసగా నాలుగో రోజు కూడా పూర్తి ఓవర్ల ఆట సాధ్యం కాలేదు. గురువారం 55.5 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. చివరి రోజు కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు 22 పరుగుల ఆధిక్యం మాత్రమే ఉంది. శుక్రవారం ఇరు జట్లు సాహసించి ఇన్నింగ్స్‌లను డిక్లేర్ చేసినా, మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మూడు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 1–0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు మ్యాథ్యూ వేడ్ కొట్టిన షాట్ షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అజహర్ అలీ తలకు బలంగా తగలడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతను కోలుకున్నట్లు సమాచారం.