
పాకిస్తాన్ కు భారీ లక్ష్యం
మొహాలి:వరల్డ్ టీ 20లో భాగంగా గ్రూప్-2లో పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా 194 గుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్( 61 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు), మ్యాక్స్ వెల్(30; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), షేన్ వాట్సన్(44 నాటౌట్;21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ ఆదిలో తడబడింది. ఉస్మాన్ ఖవాజా(21), డేవిడ్ వార్నర్(9), అరోన్ ఫించ్(15)లునిరాశపరిచడంతో ఆసీస్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో స్మిత్, మ్యాక్స్ వెల్ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడీ నాల్గో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అనంతరం స్మిత్ -వాట్సన్ ల జోడి ఆసీస్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించింది. ఇదే క్రమంలో స్మిత్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, వాట్సన్ తనదైన శైలిలో ఆడాడు. ఈ జంట 74 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు నమోదు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో వాహబ్ రియాజ్, ఇమాద్ వసీంలకు తలో రెండు వికెట్లు లభించాయి.