
ప్రపంచకప్ నుంచి పాక్ అవుట్
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించింది. గ్రూప్-2లో భాగంగా శుక్రవారం ఆసీస్తో జరిగిన కీలక పోరులో పాకిస్తాన్ 21 పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి వైదొలిగింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాళ్లు పోరాడినా ఫలితం దక్కలేదు. అటు బ్యాటింగ్ లోనూ, బౌలింగ్ లోనూ రాణించి ఘన విజయం సాధించిన ఆసీస్ సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు నమోదు చేసింది.ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్( 61 నాటౌట్; 43 బంతుల్లో 7 ఫోర్లు), మ్యాక్స్ వెల్(30; 18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), షేన్ వాట్సన్(44 నాటౌట్;21 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించి ఆసీస్ భారీ స్కోరు చేయడంలో సహకరించారు.
అంతకుముందు ఉస్మాన్ ఖవాజా(21), డేవిడ్ వార్నర్(9), అరోన్ ఫించ్(15)లునిరాశపరచడంతో ఆసీస్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తరుణంలో స్మిత్, మ్యాక్స్ వెల్ జోడి ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. ఈ జోడీ నాల్గో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అనంతరం స్మిత్ -వాట్సన్ ల జోడి ఆసీస్ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించింది. ఇదే క్రమంలో స్మిత్ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేయగా, వాట్సన్ తనదైన శైలిలో ఆడాడు. ఈ జంట 74 పరుగుల అజేయ భాగస్వామ్యాన్నిసాధించడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది.
అనంతరం 194 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. పాక్ ఆటగాళ్లలో షార్జిల్ ఖాన్(30;19 బంతుల్లో 6 ఫోర్లు),ఖలిద్ లతిఫ్(46;41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), ఉమర్ అక్మల్(32;20 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్ప్), షోయబ్ మాలిక్(40 నాటౌట్; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో ఫాల్కనర్ ఐదు వికెట్లు తీసి పాక్ పతనాన్ని శాసించగా, ఆడమ్ జంపాకు రెండు, హాజల్ వుడ్కు ఒక వికెట్ దక్కింది.