బెంగళూరు: వరల్డ్ ట్వంటీ 20లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంకకు వెస్టిండీస్ షాకిచ్చింది. అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ పేలవ ప్రదర్శన కొనసాగించిన లంకేయులు.. విండీస్కు ఏ దశలోనూ పోటీనివ్వకుండానే చేతులెత్తేశారు. దీంతో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి టోర్నీలో వరుసగా రెండో గెలుపును సొంతం చేసుకుంది. శ్రీలంక విసిరిన 123 లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగించి గెలుపును సొంతం చేసుకుంది. ఓపెనర్ ఆండ్రీ ఫ్లెచర్(84 నాటౌట్;64 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దాటిగా బ్యాటింగ్ చేసి విండీస్ విజయంలో సహకరించాడు. అతనికి రస్సెల్(20 నాటౌట్) అండగా నిలవడంతో విండీస్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ బ్యాటింగ్ దిగకుండానే విండీస్ విజయం సాధించడం విశేషం. శ్రీలంక బౌలర్లలో సిరివర్ధనేకు రెండు, వాండ్రాస్సేకు ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 122 పరుగులు నమోదు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో తిషారా పెరీరా(40; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1సిక్స్) , కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్(20) మినహా ఎవరూ ఆకట్టుకోలేక పోవడంతో జట్టు స్వల్ప స్కోరుకే పరిమితమైంది. దిల్షాన్(12), చంఢీమాల్(16), తిరుమన్నే(5), కపుగదెరా(6)లు తీవ్రంగా నిరాశపరిచారు. గత మ్యాచ్లో ఇంగ్లండ్పై విండీస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
శ్రీలంకకు విండీస్ షాక్
Published Sun, Mar 20 2016 10:43 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement