'అండర్ డాగ్స్గానే వరల్డ్ కప్ గెలుస్తాం'
కోల్కతా:వరల్డ్ టీ 20లో అండర్ డాగ్స్గానే ఇంగ్లండ్తో తుదిపోరుకు సిద్ధమవుతున్నట్లు వెస్టిండీస్ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీ స్పష్టం చేశాడు. ఈ టోర్నీకు ముందు తమపై ఎటువంటి అంచనాలు లేవని, దాన్నే అంతిమ సమరంలో కూడా కోరుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అయితే అండర్ డాగ్స్గానే వరల్డ్ కప్ను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
'బ్యాటింగ్లో విధ్వంసర ఆటగాళ్లు మా సొంతం. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న మా ఆటగాళ్లు బలం మాకు తెలుసు. లెండిల్ సిమ్మన్, ఛార్లెస్లతో కూడిన బౌండరీ హిట్టర్స్ విండీస్ జట్టులో ఉన్నారు. టైటిల్ గెలవడానికి ఇంకా ఒక అడుగు దూరంలోనే ఉన్నాం. విండీస్ జట్టు ఏం చేయాలనుకుంటుందో దాన్ని కచ్చితంగా అమలు చేయగలదు. పిచ్ ఎలా ఉన్నా పోరాడటమే మా నైజం. ప్రస్తుతం మేము ఇంగ్లండ్ జట్టుపై దృష్టి సారించాం. టోర్నీ ఆరంభానికి ముందు వెస్టిండీస్ జట్టులో చోటు చేసుకున్న వివాదాలతో మా జర్నీ కఠినంగానే సాగింది. వరల్డ్ కప్ ను గెలవాలనే ఇక్కడికి వచ్చాం. దాన్ని సాధించి తీరడమే మా లక్ష్యం' అని స్యామీ పేర్కొన్నాడు. నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఆదివారం వెస్టిండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.