విశ్వవిజేత విండీస్
కోల్కతా: విధ్వంసకర ఆటతీరే మా సొంతం, మా జట్టులో అందరూ మ్యాచ్ విన్నర్లే.. వరల్డ్ టీ 20 టోర్నీలో విండీస్ కెప్టెన్ డారెన్ స్యామీ పదేపదే చెప్పిన మాటలు. ఈ వ్యాఖ్యలను విండీస్ అక్షరాల నిజం చేసింది. ఆఖరి ఓవర్ లో 19 పరుగులు చేయాల్సిన తరుణంలో విండీస్ ఆటగాడు బ్రాత్ వైట్ నాలుగు సిక్సర్లు కొట్టి జట్టుకు అపూర్వమైన విజయాన్ని సాధించి పెట్టడమే ఇందుకు నిదర్శనం. ఆదిలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి తడబడిన కరీబియన్లు....చివరి వరకూ పోరాడి ట్రోఫీని సొంతం చేసుకున్నారు.
ఆదివారం ఈడెన్ గార్డెన్ మైదానంలో ఇంగ్లండ్ తో జరిగిన ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఈ టోర్నీ లీగ్ దశలో ఇంగ్లండ్ ను మట్టికరిపించిన వెస్టిండీస్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. తద్వారా వరల్డ్ టీ 20లో విండీస్ రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోగా, మరోసారి టైటిల్ సాధించాలనుకున్నఇంగ్లండ్ ఆశలు తీరలేదు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు నమోదు చేసింది. జేసన్ రాయ్(0), అలెక్స్ హేల్స్(1), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(5)లు నిరాశపరిచినా, జో రూట్(54;36 బంతుల్లో 7 ఫోర్లు), బట్లర్(36;22 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) జోడీ నిలకడగా ఆడారు. ఈ జోడి నాల్గో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ తేరుకుంది. ఇక చివర్లో విల్లే(21;14 బంతుల్లో 1 ఫోర్,2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పాటు, జోర్డాన్(12నాటౌట్) సమయోచితంగా ఆడటంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్కు ఆదిలోనే షాక్ తగిలింది. చార్లెస్(1), క్రిస్ గేల్(4), సిమ్మన్స్(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరడంతో విండీస్ 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత మార్లోన్ శామ్యూల్స్(85 నాటౌట్;9 ఫోర్లు, 2 సిక్సర్లు), డ్వేన్ బ్రేవో(25)లు జట్టు ఇన్నింగ్స్కు మరమ్మత్తులు చేపట్టారు. ఈ జోడీ నాల్గో వికెట్కు 75 పరుగుల భాగస్వామన్ని నెలకొల్పింది. అయితే ఆ తరువాత రస్సెల్(1), స్యామీ(2)లు ఘోరంగా విఫలం కావడంతో మ్యాచ్ ఇంగ్లండ్ విజయం దిశగా సాగింది. కాగా, ఆ తరుణంలో సిమ్మన్స్కు జతకలిసిన బ్రాత్ వైట్(34 నాటౌట్;10 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగి పోయాడు. ప్రత్యేకంగా బెన్ స్టోక్స్ వేసిన చివరి ఓవర్ లో ఆకాశమే హద్దుగా విధ్వంసర ఇన్నింగ్స్ ఆడిన బ్రాత్ వైట్ విండీస్ కు అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టాడు.