'విండీస్ను తక్కువ అంచనా వేయొద్దు'
కోల్కతా: వరల్డ్ టీ 20లో భాగంగా గురువారం భారత్తో తలపడే వెస్టిండీస్ను తక్కువ అంచనా వేయొద్దని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు. ఆ పోరును ఎట్టి పరిస్థితుల్లోనూ తేలిగ్గా తీసుకోవద్దని ధోని అండ్ గ్యాంగ్ ను గంగూలీ హెచ్చరించాడు. 'విండీస్తో జరజాగ్రత్త. వారి బౌలింగ్ శైలి భారత్ లోని పిచ్లకు సరిగ్గా సరిపోతుంది. దాంతో పాటు క్రిస్ గేల్, సిమ్మన్స్లతో కూడిన వారి బ్యాటింగ్ చాలా ప్రమాదకరం. ఆ జట్టుతో పోరుకు అన్నిరకాలకు సిద్ధంకండి'అని టీమిండియాకు విజ్ఞప్తి చేశాడు. లక్ష్య ఛేదనలో సచిన్ కంటే విరాట్ కోహ్లినే అత్యుత్తమ ఆటగాడు. గ్రేట్ మ్యాన్ సచిన్ కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంది. ఛేజింగ్ లో మాత్రం సచిన్ కంటే విరాట్ బెస్ట్ అనేది నా అభిప్రాయం'అని గంగూలీ పేర్కొన్నాడు.
విధ్వంసకర ఆటగాళ్లు మా సొంతం: స్యామీ
వెస్టిండీస్ జట్టులో విధ్వంసకర ఆటగాళ్లకు కొదవలేదని ఆ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీ స్పష్టం చేశాడు. టీమిండియా జట్టులో విరాట్ కోహ్లి కీలక ఆటగాడనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. అయితే అవతలి జట్టు బలాబలాలపై కంటే తమ జట్టు ఆటతీరుపైనే ప్రధానం దృష్టి సారించామన్నాడు.' మా డ్రెస్సింగ్ రూమ్ చాలా మంది విధ్వంసకర ఆటగాళ్లతో నిండి వుంది. టీమిండియాతో పోరుకు సిద్ధంగా ఉన్నాం. ధోని సేన ఎదుర్కొనే సత్తా మాలో వుంది'అని స్యామీ హెచ్చరించాడు.