ధోని సేన ఇంటికి.. ఫైనల్కు విండీస్
ముంబై: వరల్డ్ టీ 20లో మరో ఉత్కంఠ పోరుకు తెరలేచింది. గురువారం వాంఖేడే స్టేడియంలో భారత్ తో చివరి వరకూ తీవ్ర ఆసక్తిని రేపిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ అద్భుత విజయాన్ని సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఊహించిన మలుపుల మధ్య ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో ధోని సేన ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత్ విసిరిన 194 పరుగుల లక్ష్యాన్ని కరీబియన్లు ఇంకా రెండు బంతులు ఉండగానే ఛేదించి తుదిపోరుకు అర్హత సాధించారు. ఏప్రిల్ 3 వ తేదీన విండీస్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఫైనల్ పోరు జరుగనుంది.
విండీస్ ఆటగాళ్లలో క్రిస్ గేల్ (5), మార్లోన్ శామ్యూల్స్(8) ఆదిలోనే పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా.. ఆ తరువాత చార్లెస్ (52; 36 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్సర్లు), సిమ్మన్స్(83నాటౌట్; 51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) లు విండీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడీ మూడో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో విండీస్ విజయం దిశగా పయనించింది. ఆ తరువాత రస్సెల్(43 నాటౌట్;20 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) దాటిగా ఆడి విండీస్ ఫైనల్ కు చేరడంలో సహకరించాడు.
అంతకుముందు టాస్ ఓడి టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి మెరుపులు మెరిపించాడు. విరాట్ (89 నాటౌట్; 47 బంతుల్లో 11 ఫోర్లు, 1సిక్స్) చెలరేగి ఆడటంతో టీమిండియా 193 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(43;31 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్సర్లు) దాటిగా ఆడగా, అజింక్యా రహానే(40;35 బంతుల్లో 2 ఫోర్లు) సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అయితే జట్టు స్కోరు 62 పరుగుల వద్ద రోహిత్ శర్మ.. బద్రీ బౌలింగ్ లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
ఆ తరుణంలో రహానేకు జతకలిసిన కోహ్లి ఆదిలో ఆచితూచి బ్యాటింగ్ చేసినా తరువాత తనదైన మార్కుతో ఆటతో రెచ్చిపోయాడు. అతనికి జతగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని(15 నాటౌట్; 9 బంతుల్లో 1 ఫోర్) అండగా నిలవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 192 పరుగులు నమోదు చేసింది. విండీస్ బౌలర్లలో రస్సెల్, బద్రిలకు తలో వికెట్ దక్కింది.