టీ20ల్లో టార్గెట్ ఎంత ఇచ్చినా తక్కువే: ధోనీ
ముంబై: వరల్డ్ టీ 20 ప్రపంచకప్ లో గురువారం జరిగిన సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి చవిచూసినా భారత్ గుడ్ క్రికెట్ ఆడిందని కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అభిప్రాయపడ్డాడు. అయితే ఈ ఫార్మాట్లో ఎన్ని పరుగుల టార్గెట్ ఉన్నా సేఫ్ స్కోరు కాదని చెప్పాడు. ఒకవేళ భారత్ 220, 230 స్కోర్ చేసినా ప్రత్యర్థి జట్టు ఛేజ్ చేసే అవకాశం ఉందని, విండీస్ అదేపని చేసిందన్నాడు. ఛేజింగ్ చేసేటప్పుడు వికెట్ సహకరిస్తుందా లేదా అనేది చాలా కీలకమని, రహానే తన బాధ్యత నిర్వర్తించాడని ధోనీ పేర్కొన్నాడు.
బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా పూర్తిగా విఫలమయ్యారని వారు కాస్త రాణించినట్లయితే భారత్ కచ్చితంగా మ్యాచ్ గెలిచి ఫైనల్ చేరేదని ధోనీ ధీమా వ్యక్తంచేశాడు. అయితే రోహిత్, కోహ్లీ మాదిరిగా రహానే బ్యాటింగ్ చేయలేడన్నాడు. చివరి ఓవర్లలో జట్టు మరో 10-15 పరుగులు చేసి ఉండాల్సిందని, గెలిచే అవకాశాలు మెరగయ్యేవని చెప్పుకొచ్చాడు. అదృష్టాన్ని నమ్మకం కంటే కూడా గేమ్ ప్లానింగ్ జట్టుని గెలిపిస్తుందన్నాడు. అయితే ఫస్ట్ బ్యాటింగ్ లో 193 స్కోర్ అనేది చాలా గొప్పవిషయమని, టాస్ గెలిచి ఉంటే పరిస్థితులు తమకు అనుకూలించేవని కెప్టెన్ ధోనీ మనసులో మాట బయటపెట్టాడు.