ఆ జట్టు సెమీస్లోఎదురైతే..
ముంబై:వరల్డ్ టీ 20లో భాగంగా శ్రీలంక జట్టుతో సెమీ ఫైనల్లో తలపడాల్సి వస్తే వారిని కచ్చితంగా ఓడిస్తామని న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కోరీ అండర్సన్ స్పష్టం చేశాడు. ఇరు జట్ల మధ్య పూల్ విభాగంలో మ్యాచ్ జరిగే ఆస్కారం లేదని, ఒకవేళ శ్రీలంకతో సెమీస్ ఆడితే మాత్రం ఆ జట్టును ఎలా ఓడించాలో తమకు తెలుసని అండర్సన్ అన్నాడు.
'పూల్ విభాగంలో మా రెండు జట్లు వేర్వేరు గ్రూప్ల్లో ఉన్నాయి. శ్రీలంకతో సెమీస్లో మేము తలపడితే వారిని ఓడిస్తాం. శ్రీలంక జట్టులో కుమార సంగాక్కర, మహేలా జయవర్ధనేలు లేకపోవడం వల్ల మాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ప్రస్తుతం ఉన్న లంక జట్టులో కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్దే బాగా తెలిసిన ముఖం. దాంతో పాటు యువకులతో కూడిన మా జట్టు ఉత్సాహంగా ఉంది.ఫెర్ఫార్మెన్స్ విషయంలో ఏ జట్టుతో తలపడినా ఎదురుదాడికి దిగడమే మా కర్తవ్యం 'అని అండర్సన్ పేర్కొన్నాడు. తమ తొలి మ్యాచ్ టీమిండియాతో కావడంతో దృష్టంతా ఆ గేమ్పైనే నిలిపినట్లు అండర్సన్ తెలిపాడు. ఇరు జట్ల మధ్య మార్చి 15 వ తేదీన నాగ్ పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనున్న ఆమ్యాచ్ హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉందన్నాడు.
గురువారం జరిగిన వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 74 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించిన సంగతి తెలిసిందే. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. మున్రో 67;అండర్సన్ ( 60 రిటైర్డ్‌హర్ట్), గప్తిల్ (41), ఇలియట్ (36 నాటౌట్) చెలరేగారు. అనంతరం లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు మాత్రమే పరిమితమై ఓటమి పాలైంది.