డు ప్లెసిస్కు జరిమానా
న్యూఢిల్లీ:వరల్డ్ టీ 20లో శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్కు మ్యాచ్ ఫీజులు యాభై శాతం జరిమానా పడింది. శ్రీలంక విసిరిన 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 13.0 ఓవర్ లో డు ప్లెసిస్ ఎల్బీగా అవుటయ్యాడు. అయితే డు ప్లెసిస్ క్రీజ్ ను వదిలి వెళుతున్న సమయంలో తలను అడ్డంగా ఊపుతూ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్లో ఆర్టికల్ 2.1.5 కిందకు రావడంతో డు ప్లెసిస్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా పడింది. ఇటీవల భారత్ తో చెన్నైలో జరిగిన నాల్గో వన్డే సందర్భంలో కూడా డు ప్లెసిస్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ఏడాది కాలంలో ఒకే తరహా తప్పును చేయడం లెవెల్-1 నిబంధనను ఉల్లంఘించడం కావడంతో డు ప్లెసిస్ కు భారీ జరిమానా పడింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.