
వాట్సన్ ఆడటం అనుమానమే!
సిడ్నీ: ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)వేలంలోఅత్యధిక ధర దక్కించుకున్న ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ త్వరలో భారత్ లో ఆరంభం కానున్న వరల్డ్ టీ 20లో పాల్గొనడం సందేహంగా మారింది. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడుతున్న వాట్సన్ పొత్తి కడుపులో నొప్పి తీవ్రం కావడంతో ఆ టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. దీంతో వరల్డ్ కప్ టోర్నీకి ఎంపికైన వాట్సన్ అందులో పాల్గొనడంపై కూడా నీలి నీడలు అలుముకున్నాయి. గత రాత్రి బౌలింగ్ చేస్తుండగా బాధ మరింత తీవ్రం కావడంతో పీఎస్ఎల్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు వాట్సన్ ప్రకటించాడు.
దీంతో పాటు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)కు వీడియో రూపంలో ఒక సందేశాన్ని పంపాడు. ' ఇలా వీడియో పంపడం నిజంగా దురదృష్టమే. నన్ను పొత్తి కడుపులో నొప్పి తీవ్రంగా బాధిస్తోంది. డాక్టర్ల సలహా మేరకు స్వదేశానికి తిరిగొస్తున్నా. ఆస్ట్రేలియా వచ్చాక చికిత్స చేయించుకోవాలనుకుంటున్నా. వరల్డ్ కప్ నాటికి అందుబాటులో ఉంటాననే ఆశిస్తున్నా' అని అని తన ట్విట్టర్ అకౌంట్లో వీడియోను పోస్ట్ చేశాడు.ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాలతో సతమవుతున్న ఆస్ట్రేలియాకు వాట్సన్ గాయం కూడా ఇబ్బందికరంగా మారింది. ట్వంటీ 20 స్పెషలిస్టుగా పేరున్న వాట్సన్ వరల్డ్ కప్ కు దూరమైతే అది ఆస్ట్రేలియా జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.