క్రికెట్ కు షేన్ వాట్సన్ వీడ్కోలు!
మొహాలి: వరల్డ్ ట్వంటీ 20 అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోబోతున్నట్లు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ స్పష్టం చేశాడు. ఈ మేరకు తన రిటైర్మెంట్పై నిర్ణయాన్ని వాట్సన్ తాజాగా ప్రకటించాడు. ప్రస్తుతం భారత్లో జరుగుతున్న టీ 20 వరల్డ్ కప్ తరువాత తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపాడు. గతేడాది యాషెస్ సిరీస్ తరువాత టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు చెప్పిన వాట్సన్.. గత సెప్టెంబర్ నుంచి వన్డేలకు కూడా దూరంగా ఉన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు వాట్సన్ పేర్కొన్నాడు. తాను ఆస్ట్రేలియాకు ప్రాతినిథ్యం వహించడం ఒకింత గర్వంగా ఉందన్నాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవడానికి తరచు గాయాల బారిన పడటం కూడా ఒక కారణమని వాట్సన్ పేర్కొన్నాడు.
ఇటు వన్డేల్లో, టెస్టుల్లో, ట్వంటీ 20 ల్లో ఆస్ట్రేలియాకు అద్భుత విజయాలందించిన వాట్సన్.. 59 టెస్టు మ్యాచ్ లు, 190 వన్డేలు ఆడగా, 56 ట్వంటీ 20లకు ప్రాతినిథ్యం వహించాడు. 2002లో సెంచూరియన్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్తో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన వాట్సన్.. 2005లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో పాకిస్థాన్ తో జరిగిన టెస్టులో స్థానం దక్కించుకున్నాడు. అతని టెస్టు కెరీయర్ లో 35 .0 పైగా సగటుతో నాలుగు సెంచరీలు చేశాడు. టెస్టుల్లో షేన్ వాట్సన్ అత్యధిక స్కోరు 176. కాగా, 75 వికెట్లు తీశాడు. ఇక వన్డేల విషయానికొస్తే 9 సెంచరీలు ,33 హాఫ్ సెంచరీల సాయంతో 5,757 పరుగులు చేయగా, 168 వికెట్లు తీశాడు. వన్డేల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 185 నాటౌట్. ఇక ట్వంటీ 20 ల్లో ఒక సెంచరీతో పాటు, 10 హాఫ్ సెంచరీలు సాధించగా, 46 వికెట్లు తీశాడు. ట్వంటీ 20ల్లో వాట్సన్ అత్యధిక స్కోరు 124 నాటౌట్.