
'మనీష్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు'
కోల్కతా: త్వరలో జరుగనున్న ఆసియా కప్, వరల్డ్ టీ 20కు ప్రకటించిన భారత జట్టులో స్థానం దక్కని మనీష్ పాండే తన ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోవద్దని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. ఇటువంటి సమయాల్లోనే మరింత ధృడంగా ఉండి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని గంగూలీ పేర్కొన్నాడు. 'పాండే నిరాశను దరిచేరనీయొద్దు. మరింత రాణించేందుకు ప్రయత్నించు. పాండే కంటే రహానే మెరుగ్గా ఉన్నందువల్లే స్థానం దక్కలేదు. నీకంటే రహానే చాలా ముందు వరుసలో ఉన్నాడు. నువ్వు ఆడటానికి వరల్డ్ టీ 20, ఆసియా కప్ ఒక్కటే క్రికెట్ కాదు. ఇప్పటికే నీ పేరు సెలక్టర్లు దృష్టిలో ఉన్నందున బాధ పడాల్సిన అవసరం లేదు. త్వరలో నీకు తప్పకుండా మరో ఛాన్స్ వస్తుంది' అని గంగూలీ భరోసా ఇచ్చాడు.
ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో పాండే అజేయ శతకంతో రాణించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా క్లిష్ట సమయంలో రాణించడంతో సెలక్టర్లను పాండే విపరీతంగా ఆకర్షించాడు. దాంతో అతనికి శ్రీలంకతో ఈనెలలో జరిగే మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ లో చోటు దక్కింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో పాండేకు అవకాశం కల్పించారు. అయితే ఆసియా కప్ , టీ 20 వరల్డ్ కప్ టోర్నీలలో ప్రకటించే జట్టులో మనీష్ పాండేకు చోటు దక్కే అవకావం ఉందని తొలుత భావించినా.. అతనికి నిరాశే ఎదురైంది.