'మంచి-చెడుల కలయికే టీ 20 ఫార్మాట్'
ముంబై: జీవితమనేది మంచి చెడుల కలయిక. చీకటి వెలుతురుల సమ్మేళనం. మన జీవితం అంటే కేవలం మనమే కాదు.. మన చుట్టూ ఉన్న పరిస్థితులే. దాన్నే మనం మంచి చెడుల కలయిక అభివర్ణిస్తుంటాం. అయితే టీ 20 క్రికెట్ అనేది క్రికెటర్ల జీవితాల్లో ప్రధాన భాగమై పోయింది. ఒక క్రికెటర్ జీవితాన్ని తారాస్థాయికి చేర్చాలన్నా.. మరో క్రికెటర్ జీవితాన్ని పాతాళానికి తొక్కేయేలన్నా ఇప్పుడు టీ 20 క్రికెట్ పైనే ఆధారపడి వుంది. అటు కెరీర్ పరంగా, ఇటు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి క్రికెటర్లకు ఒక వరంలా దొరికింది టీ 20ఫార్మాట్.
ఇదే మాటను ముంబై రంజీ జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ ఆటగాడు ఆదిత్యా తారే తాజాగా స్పష్టం చేశాడు.' భారీ స్థాయిలో నగదును పెట్టుబడిగా పెట్టే గేమ్లలో ట్వంటీ 20 క్రికెట్ కూడా ఒకటి. తద్వారా క్రికెటర్లు మంచి జీవితాన్ని ఆస్వాదించడానికి ఆస్కారం దొరికింది. అదే సమయంలో ఈ ఫార్మాట్ క్రికెట్ స్పిన్నర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ధనాధన్ క్రికెట్లో స్పిన్నర్లు రాణించడం కష్టంతో కూడుకున్న పని కాబట్టి వారి కెరీర్ అయోమయంలో పడే ప్రమాదం కూడా ఉంది. అయితే చెడు కంటే కూడా మంచే ఇక్కడ ఎక్కువగా ఉంది' అని ఆదిత్య తారే పేర్కొన్నాడు.
టీ 20 జనరేషన్లో తాను క్రికెటర్గా ఉండటం నిజంగా అదృష్టమేనన్నాడు. తన పరంగా చూస్తే టీ 20 క్రికెట్లో చాలా సానుకూలాంశాలున్నాయన్నాడు. అటు ఆర్థికపరమైన వెసులుబాటుతో పాటు, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈ గేమ్ ద్వారానే తనకు లభించదన్నాడు. ఒక సౌలభ్యమైన జీవితాన్ని అనుభవించడానికి టీ 20 క్రికెట్ కారణమన్నాడు. ఈ గేమ్ ద్వారా చాలా మంది స్పాన్సర్లు మనల్ని కలుస్తుంటారని, అదే మన మొత్తం మైండ్ సెట్ లో మార్పును తీసుకొస్తుందన్నాడు.
ఇదే సమయంలో టీ 20 ఫార్మాట్లో కొన్ని ప్రతికూలాంశాలను కూడా తారే ఎత్తి చూపాడు. ఒక నాణ్యమైన స్పిన్ బౌలర్పై టీ 20 ఫార్మాట్ ప్రభావం చూపిన దాఖలాలు చాలానే ఉన్నాయన్నాడు. ఇది బ్యాట్స్ మెన్ గేమ్ అయినందున, బంతి పోరాటం చేయడం చాలా కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ప్రత్యేకంగా ఈ ఫార్మాట్లో స్పిన్నర్లు ప్రభావం చూపే అవకాశాలు తక్కువన్నాడు. టీ 20 ఫార్మాట్ ప్రవేశపెట్టిన కొత్తలో మన స్పిన్ బౌలర్లు బాగా ఇబ్బంది పడే సంగతిని తారే గుర్తు చేశాడు. కాగా, ఇప్పుడు టీ 20ల్లో భారత క్రికెట్ జట్టు ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ మంచి స్పిన్నర్లను కల్గి ఉండటం నిజంగా అభినందనీయమన్నాడు. తాజా పరిస్థితుల్లో కనీసం ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగుతుందని, ఇది టీ 20 క్రికెట్ కు శుభపరిణామన్నాడు.