అప్ఘానిస్తాన్ 'సూపర్' షో
నాగ్పూర్: వరల్డ్ టీ 20లో భాగంగా జింబాబ్వేతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్లో సూపర్ షోతో అదరగొట్టిన అఫ్ఘానిస్తాన్ ప్రధాన పోటీకి అర్హత సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లో సైతం ఆకట్టుకున్న అప్ఘానిస్తాన్.. జింబాబ్వే పెట్టుకున్న ఆశలకు కళ్లెం వేసింది. అప్ఘాన్ 59 పరుగులతో తేడాతో గెలిచి సూపర్-10 కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇటీవల జింబాబ్వేపై రెండు సిరీస్లు నెగ్గిన అప్ఘానిస్తాన్ అదే ఊపును వరల్డ్ టీ20లో కొనసాగించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
గ్రూప్-బిలో భాగంగా టాస్ గెలిచిన అఫ్ఘానిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అప్ఘానిస్తాన్ ఓపెనర్ నూర్ అలీ జర్దాన్(10) తొలి వికెట్గా పెవిలియన్కు చేరినా, మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(40;23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. అనంతరం అస్ఘర్ స్టానింక్జాయ్(0), గులాబ్దిన్ నాయిబ్(7)లు నిరాశపరచడంతో అప్ఘాన్ 63 పరుగులకే నాలుగు వికెట్లును కోల్పోయింది. ఆ తరుణంలో షెన్వారీ, మొహ్మద్ నబీల జోడీ అఫ్ఘాన్ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. అయితే ఈ జోడీ 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన అనంతరం షెన్వారీ(43) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, మొహ్మద్ నబీ(52;32 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ నమోదు చేసి అప్ఘాన్ భారీ స్కోరు చేయడంలో్ సహకరించాడు.
ఆ తరువాత 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన జింబాబ్వే ఏ దశలోనూ ఆకట్టులేకపోవడంతో ఘోర ఓటమి పాలైంది. జింబాబ్వే ఆటగాళ్లలో సిబందా(13), కెప్టెన్ మసకద్జ(11), ముతాంబామి(10), విలియమ్స్(13), వాలర్(7) ఇలా టాపార్డ్ పూర్తిగా వైఫల్యం చెందడంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకే పరిమితమై పరాజయం చెందింది. అప్ఘాన్ బౌలర్లలో రషిద్ ఖాన్ మూడు వికెట్లు సాధించగా, హాసన్ కు రెండు వికెట్లు, మొహ్మద్ నబీ, షెన్వారీలకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు స్కాట్లాండ్, హాంకాంగ్ జట్లపై అప్ఘాన్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో తాను ఆడిన మూడు క్వాలిఫయింగ్ మ్యాచ్ల్లో అఫ్ఘాన్ గెలవడంతో సూపర్-10కు నేరుగా అర్హత సాధించింది. కాగా, క్వాలిఫయింగ్లో రెండు మ్యాచ్లు మాత్రమే గెలిచిన జింబాబ్వే ఇంటిదారి పట్టింది.