విండీస్కు అఫ్ఘాన్ షాక్
నాగ్పూర్:వరల్డ్ టీ 20లో అఫ్ఘానిస్తాన్ సంచలన విజయం సాధించింది. గ్రూప్-1లో భాగంగా ఆదివారం విండీస్ తో జరిగిన మ్యాచ్లో అఫ్ఘాన్లు అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. ఈ టోర్నీలో సంచలన ప్రదర్శనతో ఆకట్టుకున్న పసికూనలు.. కరీబియన్లకు షాకిచ్చారు. తొలుత అఫ్ఘాన్ను 123 పరుగులకే కట్టడి చేసిన వెస్టిండీస్.. ఆ తరువాత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడి ఆరు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తద్వారా లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడిన విండీస్ తొలిసారి పరాజయం ఎదుర్కొంది.
టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ తీసుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన అఫ్ఘాన్ ఆదిలోనే ఉస్మాన్ ఘని(4) వికెట్ ను నష్టపోయింది. అనంతరం మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(24) ఫర్వాలేదనిపించాడు. ఆపై అస్గర్ స్టానిక్ జాయ్(16), గుల్దాబిన్ నైబ్(8), షెన్వారీ(1)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు చేరడంతో అఫ్ఘాన్ 56 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో నజిబుల్లా జద్రాన్(48 నాటౌట్. 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో అఫ్ఘానిస్తాన్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.
అనంతరం 124 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ 20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టానికి 117 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. చార్లెస్(22), డ్వేన్ బ్రేవో(28), ఫ్లెచర్(11), రామ్ దిన్(18), బ్రాత్ వైట్(13)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటడంతో విండీస్ కు ఓటమి తప్పలేదు. అఫ్ఘాన్ బౌలర్లలో మొహ్మద్ నబీ, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు సాధించగా,అమిర్ హమ్జా, హమిద్ హసన్,గుల్దాబిన్ నైబ్ లకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది.