కఠిన శ్రమ, త్యాగాల ఫలితమే టీ20 ఫార్మాట్లో తన విజయానికి కారణమని వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ అన్నాడు. పొట్టి ఫార్మాట్లో విండీస్ తరఫున దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు.
టీ20 ప్రపంచకప్-2024 లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పూరన్ దంచికొట్టిన విషయం తెలిసిందే. సెయింట్ లూసియా వేదికగా 53 బంతుల్లో 98 పరుగులు చేసిన పూరన్.. దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు.
అలా సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. అయితే, క్రిస్ గేల్‌ను అధిగమించి విండీస్ తరఫున టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు.
ఈ నేపథ్యంలో నికోలస్ పూరన్ స్పందిస్తూ.. ‘‘98 పరుగుల వద్ద అవుటవ్వాలని ఎవరూ కోరుకోరు. గౌరవప్రదమైన స్కోరు నమోదు చేయాలనే తొందరలో అలా జరిగిపోయింది.
ఏదేమైనా జట్టును గెలిపించడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా క్రిస్ గేల్ మాదిరి ప్రేక్షకులకు వినోదం పంచడం నాకెంతో ఇష్టం. ఇక ముందు కూడా ఇలాగే ముందుకు సాగుతాను’’ అని నికోలస్ పూరన్ చెప్పుకొచ్చాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 ఆరంభంలో పూరన్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్‌పై 17, ఉగాండాపై 22, పపువా న్యూగినియాపై 27 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఆఖరి మ్యాచ్‌లో.. అసలైన మజా
టీ20 ప్రపంచకప్ లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో క్రికెట్ ప్రేక్షకులకు అసలైన మజా లభించింది. నామమాత్రమైన మ్యాచ్‌లో కరీబియన్ హిట్టర్ నికోలస్ పూరన్ (53 బంతుల్లో 98; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) అఫ్గానిస్తాన్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. అతని వీరవిహారంతో ఈ టి20 ప్రపంచకప్‌లోనే ఆతిథ్య వెస్టిండీస్ అత్యధిక స్కోరు నమోదు చేసింది.
ఇప్పటికే ఇరుజట్లు తదుపరి ‘సూపర్–8’ దశకు అర్హత సంపాదించాయి. దీంతో గ్రూప్ ‘సి’లో ఎవరికీ ఫలితంతో పని లేని ఈ మ్యాచ్‌లో విండీస్ 104 పరుగుల భారీ తేడాతో అఫ్గానిస్తాన్‌పై జయభేరి మోగించింది. టాస్ నెగ్గిన అఫ్గాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
ఒకే ఓవర్లో 36 పరుగులు...
విండీస్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓపెనర్ బ్రాండన్ కింగ్ (7) రెండో ఓవర్లో నిష్క్రమించాడు. క్రీజులో ఉన్న మరో ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (27 బంతుల్లో 43; 8 ఫోర్లు)తో జతకట్టిన పూరన్... అఫ్గాన్‌పై విధ్వంసరచన చేశాడు. దీంతో జట్టు స్కోరు కేవలం 3.1 ఓవర్లలోనే 50 దాటింది.
అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఈ నాలుగో ఓవర్లోనే ఏకంగా 36 పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను పూర్తిగా పూరనే ఎదుర్కొని 6, నోబ్+4, వైడ్+4, 0, లెగ్‌బై 4, 4, 6, 6లతో చుక్కలు చూపించాడు. ఈ మెరుపుల తుఫాన్‌తో కరీబియన్ జట్టు పవర్ ప్లే (6 ఓవర్లు)లో 92/1 స్కోరు చేసింది. 7.4 ఓవర్లలో జట్టు స్కోరు 100 దాటాక చార్లెస్ అవుటయ్యాడు. 37 బంతుల్లో 80 పరుగుల ధనాధన్ భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి షై హోప్ (17 బంతుల్లో 25; 2 సిక్స్‌లు) రావడంతో పూరన్ 31 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే హోప్ అవుట్ కావడంతో కెపె్టన్ రోవ్‌మన్ పావెల్ (15 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా ధాటిగానే ఆడాడు. ఆఖర్లో కెపె్టన్ రషీద్ ఖాన్ వేసిన 18వ ఓవర్‌ను అసాంతం ఆడిన పూరన్ 0, 6, 4, 6, 2, 6లతో 24 పరుగులు సాధించాడు.
ఈ వేగంలో విండీస్ 19వ ఓవర్లో 200 పరుగుల మైలురాయిని దాటింది. కానీ ఆఖరి ఓవర్లో సెంచరీకి 2 పరుగుల దూరంలో పూరన్ రనౌటయ్యాడు. గుల్బదిన్ నైబ్‌కు 2 వికెట్లు దక్కగా, అజ్మతులా ఒమర్జాయ్, నవీనుల్ హక్ చెరో వికెట్ తీశారు.
అఫ్గాన్ టపటపా...
అనంతరం అసాధ్యమైన లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 16.2 ఓవర్లలోనే 114 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (28 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, నాలుగో వరుస బ్యాటర్ అజ్మతుల్లా (19 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్స్) కాస్త మెరుగ్గా ఆడారంతే!
ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. విండీస్ బౌలర్లలో పేసర్ ఒబెద్ మెకాయ్ 3 వికెట్లు పడగొట్టగా... స్పిన్నర్లు గుడకేశ్ మోతీ, అకిల్ హోసీన్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ గెలుపుతో విండీస్ గ్రూప్ ‘సి’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా ‘సూపర్–8’ పోరుకు సమాయత్తమైంది.
చదవండి: పిచ్ ఎలా ఉంది బుమ్రా?.. అయినా మాకిదే అలవాటే: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment