'టీమిండియా కొన్ని తప్పులు చేయడం వల్లే'
ముంబై:వరల్డ్ టీ 20 టోర్నీకి ముందు టీమిండియాను టైటిల్ ఫేవరెట్గా భావించినా ఆ జట్టు సెమీ ఫైనల్లో కొన్ని తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకుందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. ఆ జట్టు కొన్ని మౌలిక విషయాలను అమలు చేయడంలో విఫలమై ఓటమి పాలైందన్నాడు.
' టోర్నమెంట్కు ముందు టీమిండియా కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని అనుకున్నా. కాకపోతే నాకౌట్ స్టేజ్లో ఆ జట్టు కొన్ని తప్పులు చేసింది. ప్రత్యేకంగా నోబాల్స్ వేసి దానికి తగిన మూల్యం చెల్లించుకుంది. ఆ మ్యాచ్లో ధోని సేన నమోదు చేసిన 193 పరుగులు మంచి స్కోరే. దాంతో పాటు వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ను తొందరగా పెవిలియన్ కు పంపడంతో ఆ మ్యాచ్ లో టీమిండియా కచ్చితంగా విజయం సాధిస్తుందని భావించా. కానీ టీ 20ల్లో ఏదైనా జరగొచ్చు. విండీస్ అద్భుతమైన విజయంతో క్రెడిట్ ను సొంతం చేసుకుంది' అని వార్న్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిపై వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడో స్థానంలో విరాటే అత్యుత్తమ ఆటగాడని వార్న్ కొనియాడాడు.