ఆసీస్ పతనానికి వార్న్ కారణమా?
ధర్మశాల: షేన్ వార్న్.. ఏ మాత్రం పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచానికి తన స్పిన్ వాడిని చూపించిన ఆసీస్ దిగ్గజ బౌలర్. తన క్రికెట్ కెరీర్ లో లెగ్ బ్రేక్ గూగ్లీలతో హేమాహేమీలను వణికించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బౌలర్. ఆ క్రమంలోనే ప్రపంచ టెస్టు క్రికెట్ లో 708 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. అయితే ప్రస్తుతం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న షేన్ వార్న్ పేరు మరోసారి మార్మోగిపోతోంది.
అది కూడా భారత్ -ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నిర్ణయాత్మక చివరి టెస్టు సందర్భంగా వార్న్ ఒక్కసారిగా వార్తల్లోకొచ్చాడు. ఇందుకు కారణం ఆసీస్ తొలి ఇన్నింగ్స్ పతనాన్ని భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ శాసించడమే. శనివారం ఆరంభమైన నాల్గో టెస్టు ద్వారా భారత్ తరపును అరంగేట్రం చేసిన కుల్దీప్ నాలుగు కీలక వికెట్లు తీసి ఆసీస్ ను చావు దెబ్బ కొట్టాడు. 144/1తో భారీ స్కోరు దిశగా సాగిపోతున్నట్లు అనిపించిన కంగారూలు కుల్దీప్ జోరుకు 300ల వద్ద తలవంచారు.
డేవిడ్ వార్నర్, హ్యాండ్ స్కాంబ్, మ్యాక్స్ వెల్, కమిన్స్లను పెవిలియన్కు పంపడంతో ఆసీస్ పరుగుల వేగం తగ్గింది. ఇలా ఆసీస్ ను దెబ్బకొట్టడానికి వార్నే కారణమంటున్నాడు కుల్దీప్ యాదవ్. తన రోల్ మోడల్ అయిన వార్న్ సలహాల కారణంగానే ఆసీస్ ను దెబ్బకొట్టినట్లు పేర్కొన్నాడు. తాను తొలి వికెట్ ను తీసిన తీరును చూస్తే వార్న్ గుర్తుకు రావడం ఖాయమంటూ అభిమానాన్ని చాటుకున్నాడు. తాను తొలి వికెట్ తీసే క్రమంలో సంధించిన బంతి చైనామన్ కాదని, అదొక ఫ్లిప్పర్ అని పేర్కొన్నాడు. అది వార్న్ నుంచి నేర్చుకున్న ఒక అమూల్యమైన అస్త్రమని కుల్దీప్ తెలిపాడు.
'నాకు బాల్యం నుంచి వార్న్ అంటే చాలా ఇష్టం. అతన్నే అనుసరిస్తూ ఉంటా. వార్న్ వీడియోలను పదే పదే చూస్తూ టెక్నిక్స్ తెలుసుకునే వాడ్ని. నా అరంగేట్రం మ్యాచ్ కు ముందు వార్న్ నుంచి ప్రత్యక్షంగా సలహాలు తీసుకుని సక్సెస్ అయ్యా. వార్న్ సలహాలతో అతని జట్టుపై రాణించడం ఆశ్చర్యంగా అనిపించింది' అని కుల్దీప్ తెలిపాడు. మరి ఈ తరుణంలో వార్న్ స్వదేశీ జట్టు పతనానికి అతను ఇలా పరోక్షంగా కారణమయ్యాడనే వాదన వినిపిస్తోంది.
దీనిపై వార్న్ కూడా స్పందించాడు. ఒక మాజీ బౌలర్ గా యువ ఆటగాళ్లకు బౌలింగ్ సలహాలు ఇవ్వడంలో ఎటువంటి తప్పిదం లేదన్నాడు. ఏ దేశంలోని యువ క్రికెటర్లకైనా బౌలింగ్ మెళుకవులు నేర్పడం తనకు అత్యంత సంతృప్తిని కల్గిస్తుందన్నాడు.నిన్నటి ఆటలో కుల్దీప్ చాలా చక్కగా ఆకట్టుకున్నాడంటూ వార్న్ కొనియాడాడు. ప్రధానంగా మణికట్టుతో బంతిని స్పిన్ చేసే వాళ్లు ఎక్కువ కాలం కెరీర్ను కొనసాగిస్తారని తన కెరీర్ జ్ఞాపకాల్ని వార్న్ నెమరవేసుకున్నాడు.