వార్నర్‌ను చాలా ఈజీగా ఔట్ చేస్తా: కుల్దీప్
సాక్షి, కోల్‌కతా : ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు, ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను తాను చాలా తేలికగా పెవిలియన్ బాట పట్టించగలనని టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ అన్నారు. తన బౌలింగ్‌ను ఎదుర్కొన్నప్పుడు వార్నర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నందున అలాంటి బ్యాట్స్‌మెన్‌ను ఈజీగా ఔట్ చేయవచ్చునని తెలిపారు. ఇదివరకే రెండుసార్లు వార్నర్‌ను చైనామన్ బౌలర్ కుల్దీప్ ఔట్ చేసిన విషయం తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇటీవల జరిగిన తొలి వన్డేలో వార్నర్‌ను కుల్దీప్ ఔట్ చేశాడు. కుల్దీప్ టెస్టుల్లో అరంగేట్రం చేసిన ధర్మశాల టెస్టులోనూ అతడి వికెట్ సాధించడం విశేషం.
'తొలి వన్డేలో ప్రదర్శన నాలో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేసింది. దాంతో సహజంగానే నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. తొలి వన్డేలో ధోని సూచనలు సాటించి వార్నర్, స్టొయినిస్‌ను ఔట్ చేశాను. అతడి బలహీనత నాకు తెలుసు. అందుకే నా బౌలింగ్‌లో ఆడేందుకు వార్నర్ ఇబ్బంది పడతాడు. ఇది నాకు కలిసొచ్చే అంశం. నా గేమ్ ప్లాన్ సక్సెస్ అయితే వార్నర్‌ను ఏ విధంగానైనా ఔట్ చేస్తా. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బౌలర్లను అంచనా వేసి పరుగులు చేయగలడు. సంప్రదాయ స్పిన్నర్లు కేవలం కొన్ని రకాల బంతులు వేయగలరు. అదే మణికట్టు స్పిన్నర్లైతే చాలా వైవిధ్య బంతులతో బ్యాట్స్‌మెన్లపై ఆధిపత్యం చెలాయిస్తారు. నాతో పాటు మరో మణికట్టు స్పిన్నర్ చహల్ ఉంటడం జట్టుకు కలిసొస్తుందని' చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ వివరించారు. నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో వన్డే జరగనుంది.