పది వికెట్ల పరాభవం | Australia Win Aganist India In First ODI In Mumbai | Sakshi
Sakshi News home page

పది వికెట్ల పరాభవం

Published Wed, Jan 15 2020 3:10 AM | Last Updated on Wed, Jan 15 2020 8:33 AM

Australia Win Aganist India In First ODI In Mumbai  - Sakshi

డేవిడ్‌ వార్నర్‌, ఆరోన్‌ ఫించ్‌

పేలవ బ్యాటింగ్‌ ప్రదర్శన... 350 పరుగులు కూడా ఛేదించగలిగే ఈ రోజుల్లో 90లనాటి స్కోరుతో ప్రత్యరి్థకి సునాయాస లక్ష్యం... ఆపై ఐదుగురు బౌలర్ల సమష్టి వైఫల్యం... ఇదే అదనుగా చెలరేగిన ఆసీస్‌ ఓపెనర్ల రికార్డు భాగస్వామ్యం... ఫలితంగా భారత వన్డే చరిత్రలో అతి పెద్ద పరాజయాల్లో ఒకటి వాంఖడేలో నమోదైంది. సొంతగడ్డపై ఆడుతూ కూడా టీమిండియా అనూహ్యంగా కంగారూల ముందు తలవంచింది. ఒక్క వికెట్‌ కూడా తీయకుండానే మ్యాచ్‌ను అప్పగించింది.

కోహ్లి సేన ప్రయోగాలు పని చేయలేదు, వ్యూహాలు అమలు కాలేదు. దాంతో హోరాహోరీగా సాగుతుందనుకున్న పోరు ఏకపక్షంగా మారిపోయింది. వార్నర్, ఫించ్‌ తాము ఆడుతోంది ఆస్ట్రేలియాలో అన్నంత అలవోకగా పరుగులు రాబట్టడంతో మరో 12.2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆసీస్‌ విజయాన్ని అందుకుంది. ఏడాది క్రితం భారత్‌లోనే సాధించిన సిరీస్‌ విజయానికి కొనసాగింపుగా మరో గెలుపును తమ ఖాతాలో వేసుకుంది.

ముంబై: ఆ్రస్టేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ పరాభవంతో మొదలు పెట్టింది. మంగళవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఆ్రస్టేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది. శిఖర్‌ ధావన్‌ (91 బంతుల్లో 74; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా, కేఎల్‌ రాహుల్‌ (61 బంతుల్లో 47; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్టార్క్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 37.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 258 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ వార్నర్‌ (112 బంతుల్లో 128 నాటౌట్‌; 17 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌ (114 బంతుల్లో 110 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. భారత్‌ ఒక్క వికెట్‌ కూడా తీయలేక చతికిలపడింది. సిరీస్‌లో ఆసీస్‌ 1–0తో ముందంజ వేయగా, రెండో మ్యాచ్‌ ఈ నెల 17న రాజ్‌కోట్‌లో జరుగుతుంది.  

కీలక భాగస్వామ్యం...
విశ్రాంతి అనంతరం మళ్లీ మైదానంలోకి దిగిన రోహిత్‌ శర్మ (10) తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. స్టార్క్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను ఆ తర్వాత స్టార్క్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఈ దశలో ధావన్, రాహుల్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా ధావన్‌ చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. ఒక దశలో అతను 11 బంతుల వ్యవధిలో 5 ఫోర్లు కొట్టాడు. తొలి పవర్‌ప్లేలో భారత్‌ 45 పరుగులే చేయగలిగింది. ఆ తర్వాత ఇద్దరూ చక్కటి సమన్వయంతో ఆడటంతో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. ఈ క్రమంలో 66 బంతుల్లో ధావన్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత రాహుల్‌ను అగర్‌ అవుట్‌ చేయడంతో 121 పరుగుల భాగస్వామ్యానికి తెర పడింది. 55 పరుగుల వద్ద అగర్‌ బౌలింగ్‌లో వార్నర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన ధావన్‌... ఆ తర్వాత దానిని పెద్దగా వాడుకోలేకపోయాడు. కమిన్స్‌ అతడిని అవుట్‌ చేశాడు.

సమష్టి వైఫల్యం...  
భారీ భాగస్వామ్యం తర్వాత ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా పట్టుదలగా నిలబడకపోవడంతో భారత్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. నాలుగో స్థానంలో వచి్చన కోహ్లి (16) విఫలం కాగా, అయ్యర్‌ (4) అతడిని అనుసరించాడు. 30 పరుగుల వ్యవధిలో భారత్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత పంత్‌ (33 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్‌), జడేజా (32 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే కొద్దిగా నిలబడి ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించగలిగారు. వీరిద్దరు వరుస ఓవర్లలో వెనుదిరిగారు. అనంతరం భారత్‌ మిగిలిన వికెట్లు కోల్పోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.  

ఆడుతూ పాడుతూ...
లక్ష్య ఛేదనలో ఆ్రస్టేలియా ఏ దశలోనూ తడబడలేదు. వార్నర్, ఫించ్‌ తమ అనుభవాన్ని ఉపయోగిస్తూ సమర్థంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఐదుగురు భారత బౌలర్లలో ఒక్కరు కూడా వారిని ఇబ్బంది పెట్టలేకపోయారు. పరుగులు చేయడంలో వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. బుమ్రా ఓవర్లో ఫించ్‌ రెండు ఫోర్లు కొట్టగా, శార్దుల్‌ ఓవర్లో రెండు ఫోర్లు, సిక్స్‌తో వార్నర్‌ దూకుడు ప్రదర్శించాడు. షమీని ఇద్దరూ వదల్లేదు. పవర్‌ప్లే ముగిసేసరికే ఆసీస్‌ స్కోరు 84 పరుగులకు చేరింది.

ఆ వెంటనే కోహ్లి ఇద్దరు స్పిన్నర్లను బౌలింగ్‌కు దించినా  ఫలితం దక్కలేదు. వార్నర్‌ 40 బంతుల్లో, ఫించ్‌ 52 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వీరిద్దరి జోరు తగ్గలేదు. దాంతో కోహ్లి మళ్లీ బుమ్రాను ఆశ్రయించాడు. అయితే తన రెండో స్పెల్‌లో బుమ్రా రెండు ఓవర్లు వేయగా 19 పరుగులు వచ్చాయి. బుమ్రా బౌలింగ్‌లోనే పాయింట్‌ దిశగా బౌండరీ కొట్టి వార్నర్‌ 88 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అనంతరం జడేజా ఓవర్లో లెగ్‌సైడ్‌ వైపు స్వీప్‌ చేసి ఫోర్‌ రాబట్టిన ఫించ్‌ 108 బంతుల్లో శతకం చేరుకున్నాడు. ఇక ఆసీస్‌ విజయం సాధించకుండా ఆపడం భారత్‌ వల్ల కాలేదు.

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) వార్నర్‌ (బి) స్టార్క్‌ 10; ధావన్‌ (సి) అగర్‌ (బి) కమిన్స్‌ 74; రాహుల్‌ (సి) స్మిత్‌ (బి) అగర్‌ 47; కోహ్లి (సి అండ్‌ బి) జంపా 16; అయ్యర్‌ (సి) క్యారీ (బి) స్టార్క్‌ 4; పంత్‌ (సి) టర్నర్‌ (బి) కమిన్స్‌ 28; జడేజా (సి) క్యారీ (బి) రిచర్డ్సన్‌ 25; శార్దుల్‌ (బి) స్టార్క్‌ 13; షమీ (సి) క్యారీ (బి) రిచర్డ్సన్‌ 10; కుల్దీప్‌ (రనౌట్‌) 17; బుమ్రా (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (49.1 ఓవర్లలో ఆలౌట్‌) 255
వికెట్ల పతనం: 1–13; 2–134; 3–140; 4–156; 5–164; 6–213; 7–217; 8–229; 9–255; 10–255.
బౌలింగ్‌: స్టార్క్‌ 10–0–56–3; కమిన్స్‌ 10–1–44–2; రిచర్డ్సన్‌ 9.1–0–43–2; జంపా 10–0–53–1; అగర్‌ 10–1–56–1.

ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (నాటౌట్‌) 128; ఫించ్‌ (నాటౌట్‌) 110; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (37.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 258.  
బౌలింగ్‌: షమీ 7.4–0–58–0; జస్‌ప్రీత్‌ బుమ్రా 7–0–50–0; శార్దుల్‌ ఠాకూర్‌ 5–0–43–0; కుల్దీప్‌ యాదవ్‌ 10–0–55–0; రవీంద్ర జడేజా 8–0–41–0.

‘మూడు రంగాల్లోనూ విఫలమయ్యాం. ఆ్రస్టేలియా చాలా పటిష్టంగా ఉంది. దానికి తగినట్లుగా ఆడకపోతే ఇదే రకంగా బాధపడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో మేం ఆసీస్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగితే బాగుండేది. రాబోయే మ్యాచ్‌ మాకు పెద్ద సవాల్‌. ఫార్మాట్‌ ఏదైనా అంతర్జాతీయ క్రికెట్‌ అనుభవానికి ఏదీ సాటి రాదు. యువ ఆటగాళ్లు బలమైన బౌలర్లను ఎదుర్కొని గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడేందుకు ఇది మంచి అవకాశం. నేను నాలుగో స్థానంలో ఆడటంపై గతంలో కూడా చర్చ జరిగింది. రాహుల్‌ ఫామ్‌ను బట్టి ముందు పంపాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇప్పుడు దీనిపై పునరాలోచిస్తాం. ఫలితంపై ఆందోళన చెందాల్సిన పని లేదు. మాకు ఏదీ అనుకూలించని రోజుల్లో ఇదొకటి’
– విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్

►5 వన్డేల్లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓడటం ఇది ఐదోసారి మాత్రమే. స్వదేశంలోనైతే రెండోసారి. 2005లో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 వికెట్లతో గెలిచింది

►6 భారత్‌పై ఓ వన్డే మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు సెంచరీలు చేయడం ఇది ఆరోసారి. ఆస్ట్రేలియా నుంచి ఇది రెండోసారి. 1986లో డేవిడ్‌ బూన్‌–జెఫ్‌ మార్ష్ (ఆ్రస్టేలియా) తొలిసారి ఈ ఘనత సాధించారు.

►1 భారత్‌పై వన్డేల్లో ఏ జట్టు తరఫు నుంచైనా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ నమోదు చేసిన అతి పెద్ద భాగస్వామ్యం ఇదే (258). గతంలో స్మిత్‌–బెయిలీ (ఆ్రస్టేలియా) 242 పరుగులు నమోదు చేశారు.

►2 ఒక జట్టు 10 వికెట్లతో నెగ్గిన మ్యాచ్‌లో ఇది (258) రెండో అత్యధిక స్కోరు. గతంలో దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టపోకుండా శ్రీలంకపై 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

►18వన్డేల్లో వార్నర్‌ సెంచరీల సంఖ్య. ఆ్రస్టేలియా తరఫున మార్క్‌ వా (18)తో సమంగా రెండో స్థానంలో నిలవగా, పాంటింగ్‌ (29) అందరికంటే ముందున్నాడు. ఈ మ్యాచ్‌లోనే వార్నర్‌ వన్డేల్లో 5 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement