ఇండోర్:టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డే ద్వారా ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా ఓపెనర్ అరోన్ ఫించ్ విజృంభించాడు. 110 బంతుల్లో11 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం బాదాడు. ఆదిలో భారత బౌలర్లలను ఆచితూచి ఆడిన ఫించ్.. క్రీజ్ లో కుదురుకున్న తరువాత చెలరేగి ఆడాడు.బౌలర్ ఎవరనేది చూడకుండా బౌండరీల లక్ష్యంగా బ్యాట్ ఝుళిపించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ లు శుభారంభాన్ని అందించారు. ఈ జోడి కుదురుగా ఆడుతూ ఆసీస్ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. అయితే వార్నర్(42;44 బంతుల్లో 4 ఫోర్లు 1సిక్స్) హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన తరువాత తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ సమయంలో ఫించ్ కు కెప్టెన్ స్టీవ్ స్మిత్ జత కలిశాడు. వీరిద్దరూ కలిసి ఎటువంటి తడబాటు లేకుండా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే ఫించ్ 60 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆపై జోరు పెంచిన ఫించ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అరోన్ ఫించ్ 125 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 124 పరుగులు చేసిన అనంతరం రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. దాంతో 154 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరొకవైపు స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ సాధించాడు.