డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత్‌తో రేపు జరిగే చివరి వన్డేతో పాటు 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతనికి గజ్జల్లో గాయమైంది. గాయానికి చికిత్సతో పాటు వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం కావాలని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)... టెస్టు సిరీస్‌కల్లా అతను ఫిట్‌గా ఉండాలని కోరుకుంటోంది. వార్నర్ స్థానంలో డార్సీ షార్ట్‌ను ఆస్ట్రేలియా ఎంపిక చేసింది.
మరోవైపు ప్రధాన పేసర్ ప్యాట్ కమిన్స్‌కు మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పించింది. అతను కూడా రేపు జరిగే వన్డేతో పాటు టి20 సిరీస్‌లో బరిలోకి దిగడు. ‘వార్నర్, కమిన్స్ మా టెస్టు జట్టు ప్రణాళికల్లో ఎంతో కీలక ఆటగాళ్లు. వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. కమిన్స్‌కు మాత్రం ఫిట్‌గా ఉండేందుకు కొంత విరామం ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు.
తల తిరిగినట్లనిపించింది: స్మిత్
వరుసగా రెండో సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అసలు రెండో వన్డేలో ఆడతాననుకోలేదని అన్నాడు. మ్యాచ్ రోజు ఉదయం చాలా తీవ్రమైన తలపోటుతో బాధ పడినట్లు అతను వెల్లడించాడు. ‘ఉదయం బాగా తల తిప్పినట్లనిపించింది. మ్యాచ్ రోజు ఉదయం మైదానానికి వచ్చిన సమయంలో కూడా ఇదే పరిస్థితి. అసలు రెండో వన్డే ఆడతానని భావించలేదు. అయితే టీమ్ డాక్టర్ పలు రకాల చికిత్సలతో నా పరిస్థితిని చక్కదిద్దారు. చెవి లోపలి భాగంలో బాగా నొప్పి అనిపించింది. దానిని చక్కదిద్దిన తర్వాతే పరిస్థితి మెరుగ్గా మారింది. ఒక కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడం సంతోషకరం’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment