ముంబై: స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆ్రస్టేలియా మహిళలపై ఏకైక టెస్టు మ్యాచ్‌లో నెగ్గి సత్తా చాటిన భారత్ పరిమిత ఓవర్ల సమరాల్లో మాత్రం పేలవమైన ఆటతీరును చూపించింది. వన్డే సిరీస్‌లో 0–3తో చిత్తుగా ఓడిన మన మహిళలు ఇప్పుడు టి20 సిరీస్‌ను కూడా చేజార్చుకున్నారు. మంగళవారం జరిగిన చివరిదైన మూడో టి20లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఫలితంగా 2–1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
రిచా ఘోష్ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...స్మృతి మంధాన (28 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (17 బంతుల్లో 26; 6 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (3) మళ్లీ విఫలమైంది. ఆసీస్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనాబెల్ సదర్లాండ్, జార్జ్ వేర్‌హమ్ చెరో 2 వికెట్లు పడగొట్టగా... మేగన్ షుట్, యాష్లే గార్డ్‌నర్ చెరో వికెట్ తీశారు. అనంతరం ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 149 పరుగులు చేసింది. అలీసా హీలీ (38 బంతుల్లో 55; 9 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (45 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 60 బంతుల్లోనే 85 పరుగులు జత చేశారు. పూజ వస్త్రకర్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఆసీస్ కెపె్టన్ అలీసా హీలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. వచ్చే సెపె్టంబర్‌లో బంగ్లాదేశ్‌లో మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుండగా... ఆలోపు మన టీమ్ ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడబోవడం లేదు. తొలి వికెట్‌కు 28 బంతుల్లో 39 పరుగులు జోడించి భారత్‌కు షఫాలీ, స్మృతి సరైన ఆరంభం అందించారు. షఫాలీని అవుట్ చేసిన షుట్ మహిళల టి20ల్లో అత్యధిక వికెట్లు (131)తీసిన బౌలర్‌గా అవతరించింది. షఫాలీ అవుటయ్యాక టీమిండియా 6 పరుగుల వ్యవధిలో జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జెమీమా (2), హర్మన్‌ప్రీత్ ఇలా వచ్చి అలా వెళ్లారు.
ఈ దశలో రిచా కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకుంది. దీప్తి (14), అమన్‌జోత్ (17 నాటౌట్)లతో కలిసి తర్వాతి రెండు వికెట్లకు 69 పరుగులు జోడించడంతో టీమ్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. అయితే ఛేదనలో మెరుపు ఆరంభంతో హీలీ, మూనీ కలిసి ఆసీస్ పనిని సులువు చేశారు. టిటాస్ సాధు ఓవర్లో 3 ఫోర్లు, రేణుక వేసిన తర్వాతి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో హీలీ చెలరేగింది. 6 ఓవర్లలోనే స్కోరు 54 పరుగులకు చేరగా... 34 బంతుల్లోనే హీలీ అర్ధసెంచరీ పూర్తయింది.
వీరిద్దరి జోరుతో ఆసీస్ లక్ష్యంగా దిశగా వేగంగా సాగింది. హీలీని దీప్తి అవుట్ చేసిన కొద్దిసేపటికి వరుస బంతుల్లో తాలియా మెక్‌గ్రాత్ (20), పెరీ (0)లను వెనక్కి పంపించి పూజ ఆశలు రేపింది. అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. మూనీ, లిచ్‌ఫీల్డ్ (17 నాటౌట్) నాలుగో వికెట్‌కు 20 బంతుల్లోనే అభేద్యంగా 32 పరుగులు జత చేసి మరో 8 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.
Comments
Please login to add a commentAdd a comment