నాగ్ పూర్:భారత్ తో ఇక్కడ జరుగుతున్న చివరిదైన ఐదో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు. 56 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్ధశతకం నమోదు చేశాడు. అయితే వార్నర్ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మరుసటి బంతికే కెప్టెన్ స్టీవ్ స్మిత్(16) అవుటయ్యాడు. కేదర్ జాదవ్ బౌలింగ్ లో స్మిత్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో ఆసీస్ వంద పరుగుల వద్ద రెండో వికెట్ ను నష్టపోయింది. అంతకుముందు అరోన్ ఫించ్(32;36 బంతుల్లో 6 ఫోర్లు) తొలి వికెట్ గా అవుటయ్యాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో షాట్ కు యత్నించిన ఫించ్.. బూమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ తీసుకుంది. దాంతో వార్నర్-ఫించ్ లు ఆసీస్ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. తొలి వికెట్ కు 66 పరుగులు జోడించిన తరువాత ఫించ్ అవుటయ్యాడు. ఫించ్ ఇచ్చిన క్యాచ్ ను చేతుల్లోంచి జారవిడిచిన బూమ్రా ఆపై కిందికి పడకుండా పట్టుకున్నాడు. ఆ క్యాచ్ జారుతూ వచ్చి బూమ్రా ఒళ్లో ఆగడంతో ఫించ్ పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. ఆపై వార్నర్ తో జత కలిసిన స్మిత్ వచ్చీ రావడంతోనే ఫోర్ కొట్టాడు. దూకుడును కొనసాగించే సమయంలో స్మిత్ అవుటయ్యాడు. కాగా, ఆసీస్ స్కోరు 112 పరుగుల వద్ద ఉండగా వార్నర్ (53) మూడో వికెట్ గా అవుటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి వార్నర్ అవుటయ్యాడు. స్మిత్-వార్నర్ లు 12 పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరడంతో భారత శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. అటు తరువాత 118 పరుగుల వద్ద హ్యాండ్ స్కాంబ్ నాల్గో వికెట్ గా పెవిలియన్ చేరాడు.అక్షర్ పటేల్ బౌలింగ్ లో రహానే క్యాచ్ పట్టడం ద్వారా హ్యాండ్ స్కాంబ్(13) అవుటయ్యాడు.