అతని బౌలింగ్ పై దృష్టి పెట్టండి:స్మిత్
చెన్నై: టీమిండియాతో జరిగే పరిమిత ఓవర్ల ద్వైపాక్షిక సిరీస్ లో పైచేయి సాధించాలంటే తమ ఆటగాళ్లు అదనంగా శ్రమించక తప్పదని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హెచ్చరించారు. ప్రధానంగా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్న స్మిత్.. అతన్ని ఎదుర్కోవడం కోసం నెట్స్ లో మరింతగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరముందన్నారు. దానిలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుకు కోచింగ్ కన్సల్టెంట్గా ఉన్న భారత మాజీ క్రికెటర్ శ్రీధరన్ శ్రీరామ్ బౌలింగ్ ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయమని స్మిత్ సూచించారు.
'టీమిండియా జట్టులో ఎడమచేతి మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. అతనొక మంచి టాలెంట్ ఉన్న బౌలర్. ప్రస్తుత సిరీస్ లో కచ్చితంగా అతని బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టమే.కాకపోతే గడిచిన ఐపీఎల్లో కుల్దీప్ ను కొంతమంది ఆసీస్ క్రికెటర్లు ఎదుర్కొన్నారు. ప్రత్యేకంగా అతని స్పిన్ పై దృష్టి పెట్టాం. అతని బౌలింగ్ తొలి స్పెల్ లోనే ఎదురుదాడికి దిగి ఒత్తిడి పెంచే యత్నం చేస్తాం. మాపై కుల్దీప్ పైచేయి సాధించకుండా ఉండేందుకు సర్వశక్తులు పెడతాం. అందుకు మా కన్సల్టెంట్ గా ఉన్న ఎడమ చేతి వాటం శ్రీధర్ శ్రీరామ్ ను బౌలింగ్ ను ప్రాక్టీస్ చేస్తాం'అని స్మిత్ తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన కుల్దీప్ యాదవ్ అదరగొట్టాడు. అరంగేట్రపు మ్యాచ్ లోనే నాలుగు వికెట్లు తీసి ఆసీస్ ను వణికించాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ యాదవ్ తో జాగ్రత్త ఉండాల్సిన అవసరాన్ని సహచర ఆటగాళ్లకు స్మిత్ గుర్తు చేశారు.
ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు(ఆదివారం) ఆస్ట్రేలియా-భారత్ జట్ల చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మధ్యాహ్నం గం.1.30ని.లకు తొలి వన్డే జరుగునుంది.