ఆల్‌రౌండర్‌గా తానేమిటో మళ్లీ మళ్లీ నిరూపించుకుంటున్న రవీంద్ర జడేజా శుక్రవారం మరోసారి తన ‘మూడో కన్ను’ తెరిచాడు. ఆసీస్ పటిష్ట స్థితిలో రోజును ప్రారంభించిన తర్వాత 4 వికెట్లతో సత్తా చాటిన అతను ఇన్నింగ్స్ చివరి బంతికీ తన ముద్ర చూపించాడు. బుమ్రా బంతిని స్క్వేర్ లెగ్ దిశగా ఆడిన స్మిత్ రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే జడేజా మెరుపు వేగం ముందు అది సాధ్యం కాలేదు. డీప్ స్క్వేర్ లెగ్ నుంచి 25 గజాల దూరం పరుగెత్తుకొచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకొని 35 గజాల దూరంలో ఒకే ఒక స్టంప్ కనిపిస్తుండగా... జడేజా డైరెక్ట్ త్రోను వికెట్లను గిరాటేసి స్మిత్‌ను రనౌట్ చేసిన తీరు అద్భుతం. మరే ఫీల్డర్ ఉన్నా ఇది సాధ్యం కాకపోయేదనేది వాస్తవం. జట్టులో జడేజా ఉండటం వల్ల వచ్చే అదనపు విలువ ఏమిటో అతని ఈ ఫీల్డింగ్ ప్రదర్శన చూపించింది. ‘ఈ రనౌట్‌ను నేను మళ్లీ మళ్లీ చూసుకొని సంతోషిస్తాను. ఇది నా అత్యుత్తమ ప్రదర్శన. 30 గజాల సర్కిల్ బయటి నుంచి ఇలాంటి ఫలితం రాబట్టడం ఎంతో గొప్ప విషయం. మూడు, నాలుగు వికెట్ల తీసిన ప్రదర్శనతో పోలిస్తే ఇది ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతుంది’ అని జడేజా వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment