'అదే జట్టు.. అదే గ్రౌండ్.. అదే వయసు'
కోల్కతా: ఆస్ట్రేలియాతో ఇక్కడ ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ తన బౌలింగ్ తో చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఆసీస్ పటిష్టంగా ఉన్న దశలో కుల్దీప్ హ్యాట్రిక్ వికెట్లతో సత్తాచాటి భారత జట్టు విజయంలో ముఖ్య భూమికపోషించాడు. ఈ మ్యాచ్ లో కుల్దీప్ సాధించిన వికెట్లు మూడే అయినప్పటికీ అవి హ్యాట్రిక్ గా రావడం విశేషం. అయితే కుల్దీప్ ప్రదర్శనను భారత వెటరన్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో ఉదహరిస్తూ అతనిపై ప్రశంసలు కురిపించాడు.
'రికార్డు పుస్తకాల్లో నిలిచిపోయే కుల్దీప్ ప్రదర్శన నిజంగా అద్వితీయం. నిన్నటి మ్యాచ్ లో కుల్దీప్ హ్యాట్రిక్ వికెట్లు సాధించడం ఒకనాటి నా జ్ఞాపకాల్ని గుర్తు చేసింది. 2001 మార్చిలో ఆసీస్ జట్టుపై నేను ఇదే ప్రదర్శన చేశా. అదే ప్రత్యర్థి జట్టు.. అదే గ్రౌండ్.. అదే వయసులో నేను ఆ ఘనతను సాధించా. నా ప్రదర్శనను కుల్దీప్ గుర్తు చేశాడు. కుల్దీప్ యాదవ్ చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన ఇచ్చాడు. టీమిండియా జట్టులో అతనికి మంచి భవిష్యత్తు కనబడుతుంది. యువ క్రికెటర్ గా ఉండగానే ఒక బలమైన జట్టుపై కుల్దీప్ ఆ ఘనత సాధించడం అతని ఆత్మవిశ్వాసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం 'అని అంతర్జాతీయ కెరీర్ లో 700 వికెట్లకు పైగా సాధించిన హర్భజన్ కొనియాడాడు.
2001లో ఈడెన్ గార్డెన్ లో జరిగిన టెస్టు మ్యాచ్ లో హర్భజన్ హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో రికీ పాంటింగ్, ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వార్న్లను భజ్జీ వరుసగా అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. దాంతో 16 ఏళ్ల నాటి తన ప్రదర్శను భజ్జీ గుర్తు చేసుకున్నాడు. ఆ ఘనతను హర్భజన్ ను సాధించే సమయానికి అతని వయసు 21ఏళ్లు కాగా, ప్రస్తుతం కుల్దీప్ వయసు 22 ఏళ్లు కావడం ఇక్కడ విశేషం. అయితే అది టెస్టు మ్యాచ్ కాగా, తాజా మ్యాచ్ వన్డే కావడం ఇక్కడ గమనార్హం.