ముంబై: సుదీర్ఘకాలం వరల్డ్ క్రికెట్‌ను శాసించే సత్తా టీమిండియాకు ఉందని ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ స్పష్టం చేశాడు. ఇందుకు గత కొంతకాలంగా భారత క్రికెట్ సాధిస్తున్న అద్భుత విజయాలే ఉదాహరణగా పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో భారత జట్టు విదేశీ గడ్డపై అమోఘంగా రాణిస్తూ దూసుకుపోతుందన్నాడు. ‘ నా దృష్టిలో చాలాకాలం పాటు వరల్డ్ క్రికెట్‌లో భారత్ హవానే కొనసాగే అవకాశం ఉంది. ఆ జట్టులోని కీలక ఆటగాళ్లను గాయాల బారిన పడకుండా కాపాడుకుంటే భారత్‌కు తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది.
ప్రతీ ఒక్క భారత ఆటగాడు అవకాశం కోసం ఎదురుచూస్తూ తామేంటో నిరూపించుకుంటున్నారు. ప్రధానంగా టెస్టు క్రికెట్‌లో భారత జట్టు తనదైన ముద్రను వేస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్‌ను ఓడించిన భారత్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం తమ జట్టు పటిష్టంగా లేకపోయినప్పటికీ స‍్వదేశంలో మేము ఎప్పుడూ ప్రమాదమే. అయినా మమ్మల్ని మట్టికరిపించిన తీరు అమోఘం. ముఖ్యంగా బూమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మల త‍్రయం విశేషంగా రాణించడంతో ఆసీస్‌కు స్వదేశంలో సైతం ఘోర ఓటమి తప్పలేదు. ఇక్కడ బూమ్రా అసాధారణ బౌలర్‌గానే చెప్పాలి. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నాడు’ అని వార్న్ పేర్కొన్నాడు. ప్రస్తుతం భారత జట్టులో నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదవలేదన్న వార్న్.. ఆటగాళ్లను కెప్టెన్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిల అభీష్టం మేరకే ఎంపిక చేయడం కూడా ఒక మంచి పరిణామమన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment