బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌తో బుమ్రా
తొలి మ్యాచ్‌లో ఆడినట్లే ఇక్కడా ఆడితే కుదరదు. రెండో వన్డేలో ఓడిపోతే మ్యాచ్‌ను కాదు... సిరీస్‌నే కోల్పోతాం. కాబట్టి జట్టు సమష్టిగా విజయానికి కట్టుబడక తప్పదు. ఈ పోరులో సరిచేస్తేనే ఆఖరి పోరులో తేల్చుకోవచ్చు. లేదంటే ఇక్కడే తెల్లబోయే ప్రమాదముంది.
రాజ్‌కోట్: టీమిండియాకు ఇప్పుడు గెలుపు కావాలి. ఆస్ట్రేలియాకేమో ఇక్కడే సిరీస్ కావాలి. ప్రేక్షకులకు రసవత్తర పోరు కావాలి. మైదానం హోరెత్తిపోవాలి. అందరికీ అన్ని కావాలంటే ఇక్కడ మ్యాచ్ జరగాలి. వర్షం ముప్పులేదు కాబట్టి మ్యాచ్‌కు ఢోకాలేదు. దీంతో ఇక జరిగేది సమరమే. గెలుపే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతుండగా... ఆత్మవిశ్వాసంతో ఆసీస్ సై అంటోంది.
ఇరు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ రెండో వన్డే జరుగుతుంది. గత మ్యాచ్ ఫలితాన్ని పరిశీలిస్తే కంగారు జట్టు టీమిండియాను తెగ కంగారు పెట్టింది. కోహ్లిసేన మొత్తం కలిసి 50 ఓవర్లను పూర్తిగా ఆడలేకపోయిన వాంఖెడేలో... ఆసీస్ ఓపెనర్లిద్దరే 38 ఓవర్లకు ముందే నాటౌట్‌గా ముగించారు. ఇలాంటి జట్టుపై పైచేయి సాధించాలంటే భారత్ కలిసికట్టుగా ప్రత్యర్థి పనిపట్టాలి.
వన్‌డౌన్‌లోనే సారథి
సిరీస్‌ను శాసించే ఈ మ్యాచ్‌లో భారత్ ప్రయోగాల జోలికి వెళ్లకపోవచ్చు. దీంతో టీమిండియా సారథి కోహ్లి మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు దిగేందుకు సిద్ధమయ్యాడు. కాబట్టి రెగ్యులర్ ఓపెనర్లయిన రోహిత్, ధావన్ కాకుండా రాహుల్ నాలుగో స్థానానికి పరిమితం కానున్నాడు. గాయపడిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో బ్యాటింగ్‌లో నిలకడైన ప్రదర్శన కోసం కేదార్ జాదవ్‌నే టీమ్ మేనేజ్‌మెంట్ నమ్ముకుంది. అంతేగానీ అదనపు బౌలర్ ఆలోచన చేయకపోవచ్చు.
టాపార్డర్‌లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ బ్యాట్ ఝళిపిస్తే పరుగుల ప్రవాహం ఊపందుకుంటుంది. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన ధావన్ ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చాడు. రాహుల్ ఎప్పుడో జోరందుకున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్ బ్యాట్ నుంచి పరుగుల వరద మొదలైతే... వన్‌డౌన్ నుంచి మిడిలార్డర్ దాకా కెప్టెన్ కోహ్లి బ్యాటింగ్‌ను నడిపించే బాధ్యత తీసుకుంటాడు. దీంతో జట్టు భారీ స్కోరుకు ఢోకా ఉండదు.
బౌలింగ్ పదునవ్వాల్సిందే
తొలివన్డేలో భారత్ పేలవ బ్యాటింగ్‌తో పాటు పసలేని బౌలింగ్ జట్టును ముంచింది. పేసర్లు సహా స్పిన్నర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఇక రాజ్‌కోట్ వికెట్ అయితే బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇలాంటి పరిస్థితుల్లో భారత బౌలింగ్ కచ్చితంగా పదును కావాల్సిందే. లేదంటే ఇక్కడ మరింత భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుంది.
బుమ్రా, షమీలతో పాటు... స్పిన్నర్లు కుల్దీప్, జడేజా బాధ్యత తీసుకోవాల్సిందే. పరుగుల్ని నియంత్రించాల్సిందే! కొన్నాళ్లుగా భారత్ గెలిచింది ఒక్క పటిష్టమైన బ్యాటింగ్ వనరులతోనే కాదు... స్థిరమైన బౌలింగ్ ప్రదర్శనతో! ఇప్పుడు ఇక్కడా అదే ప్రదర్శన తోడ్పడితే గెలుపు ఏమంత కష్టం కానేకాదు.
ఆత్మవిశ్వాసంతో ఆసీస్
మరోవైపు సిరీస్‌లో ఘనమైన విజయారంభంతో ఆస్ట్రేలియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఉంది. అదే జోరును పునరావృతం చేసి ఆఖరిదాకా ఆగకముందే సిరీస్‌ను పట్టేయాలని కసిగా ఉంది. ఓపెనర్లు వార్నర్, ఫించ్ అజేయమైన సెంచరీలతో దూకుడు మీదున్నారు. మిడిలార్డర్ స్మిత్, లబ్‌షేన్‌లతో బాగుంది. బౌలింగ్ విభాగం కూడా భారత బ్యాటింగ్‌కు తమ తడాకా చూపించింది. స్టార్క్, కమిన్స్, కేన్ రిచర్డ్‌సన్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టారు. మరోమారు ఆల్‌రౌండ్ సత్తాతో టీమిండియాపై ఆధిపత్యం చాటాలని ఆసీస్ కదన కుతూహలంతో ఉంది.
పిచ్, వాతావరణం
వాంఖెడేతో పోల్చితే ఇది ఫ్లాట్ పిచ్. బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లకు అవకాశముంది. టాస్ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గుచూపుతుంది. వర్షం ముప్పులేదు. కానీ పగటి ఉష్ణోగ్రత 25 డిగ్రీలను మించదు.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, శ్రేయస్, జాదవ్, జడేజా, శార్దుల్, కుల్దీప్/చహల్, షమీ/సైనీ, బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, లబ్‌షేన్, స్మిత్, క్యారీ, టర్నర్, అగర్, కమిన్స్, స్టార్క్, రిచర్డ్‌సన్/హాజల్‌వుడ్, జంపా.
Comments
Please login to add a commentAdd a comment