ఆస్ట్రేలియా కూడా అన్ని జట్లలాంటిదే!
భారత కోచ్ కుంబ్లే వ్యాఖ్య
పుణే: సొంతగడ్డపై ఇటీవల భారత్‌తో తలపడిన ఇతర జట్లతో పోలిస్తే ఆస్ట్రేలియాను ఎలాంటి ప్రత్యేక దృష్టితో చూడటం లేదని భారత కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు. కంగారూలను కూడా కివీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లాంటి ప్రత్యర్థిగానే భావిస్తామని ఆయన చెప్పారు. ‘ప్రతీ ప్రత్యర్థిని మేం గౌరవిస్తాం. న్యూజిలాండ్‌తో సీజన్ ఆరంభం సమయంలోనూ ఇదే చెప్పాం. ఆస్ట్రేలియా జట్టు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వారి ప్రొఫెషనలిజం చాలా గొప్పది. అయితే ఈ సిరీస్‌కు మేం ప్రత్యేకతను ఆపాదించడం లేదు. గత కొంత కాలంగా గెలిచేందుకు మేం ఏమేం చేశామో ఈసారి దానినే పాటిస్తాం’ అని కుంబ్లే అభిప్రాయపడ్డారు.
ఈ సీజన్‌లో ఆడిన తొమ్మిది టెస్టులలో చాలాసార్లు కఠిన పరిస్థితుల్లోనూ కోలుకొని మ్యాచ్‌పై ఆధిక్యం ప్రదర్శించామని కుంబ్లే గుర్తు చేశారు. ఇవన్నీ వేర్వేరు వేదికలు, వేర్వేరు పిచ్‌లపై జరిగాయనే విషయాన్ని మరచిపోవద్దన్నారు. అయితే జట్టులో ఎవరో ఒకరు క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యత తీసుకోవడం వల్లే జట్టుకు వరుస విజయాలు దక్కాయని కుంబ్లే సంతోషం వ్యక్తం చేశారు. షేన్ వార్న్‌లాంటి దిగ్గజం స్థాయి బౌలర్లు లేకపోయినా... ప్రస్తుత ఆసీస్ జట్టులోనూ మంచి స్పిన్నర్లు ఉన్నారని కుంబ్లే అన్నారు.