ధోని సేన విజయలక్ష్యం 161
మొహాలి:వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా భారత్ తో జరుగుతున్న పోరులో ఆస్ట్రేలియా 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. అరోన్ ఫించ్(43; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు), ఉస్మాన్ ఖవాజా(26; 16 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు. ఈ క్రమంలోనే నాల్గో ఓవర్ ముగిసే సరికి ఆసీస్ వికెట్ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. దీంతో ఆసీస్ 200 పైగా స్కోరును నమోదు చేయడం ఖాయంగా కనిపించింది.
అయితే ఆ తరువాత భారత బౌలర్లు రాణించడంతో ఆసీస్ వేగం తగ్గింది. డేవిడ్ వార్నర్(6), కెప్టెన్ స్టీవ్ స్మిత్(2) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ కు పంపడంతో ధోని సేన శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఇక ఆపై మ్యాక్స్ వెల్ (31;28 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) , షేన్ వాట్సన్(18 నాటౌట్) మోస్తరుగా రాణించడంతో ఆసీస్ కాస్త ఫర్వాలేదనిపించింది. చివర్లో నేవిల్(10 నాటౌట్; 2 బంతుల్లో 1 ఫోర్, 1సిక్స్) బ్యాట్ ఝుళిపించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 160 పరుగులు నమోదు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా, బూమ్రా, నెహ్రా, అశ్విన్, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది.