
ఆ తప్పు నుంచి గుణపాఠం నేర్చుకో: ధోని
బెంగళూరు:వరల్డ్ టీ 20లో భాగంగా తమతో బుధవారం జరిగిన మ్యాచ్ లో అనవసరపు షాట్కు పోయి బంగ్లాదేశ్ ఓటమికి పరోక్షంగా కారణమైన మహ్మదుల్లా రియాద్ చేసిన తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని హితబోధ చేశాడు. బంగ్లాదేశ్ గెలుపుకు రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో మొహ్మదుల్లా చేసిన తప్పిదం కారణంగా ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకుందన్నాడు. ' మహ్మదుల్లా కొట్టిన ఆ షాట్ బౌండరీ దాటితే అతను నిజంగా హీరో అయ్యేవాడు. ఇప్పుడు అదే షాట్ అతన్ని కచ్చితంగా విమర్శలకు గురి చేస్తుంది. ఇది క్రికెట్. ఆ తప్పు నుంచి మొహ్మదుల్లా పాఠం నేర్చుకుంటాడని ఆశిస్తున్నా'అని ధోని తెలిపాడు.
బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత్ ఒక పరుగు తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. భారత్ బౌలర్ హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్ నాల్గో బంతికి బంగ్లా సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్ భారీ షాట్ ఆడబోయి శిఖర్ ధావన్ క్యాచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి బంగ్లాదేశ్ విజయానికి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాలి. కాగా, ఆ తదుపరి బంతికి అదే తరహా షాట్ ఆడిన మహ్మదుల్లా జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక చివరి బంతికి ముస్తాఫిజుర్ రెహ్మాన్ రనౌట్ కావడంతో బంగ్లాదేశ్ గెలవాల్సిన మ్యాచ్ ను భారత్ కైవసం చేసుకుంది.