
కీలక పోరుకు ధోని సేన సిద్ధం!
బెంగళూరు:వరల్డ్ టీ 20లో ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియా మరో కీలక పోరుకు సన్నద్ధమైంది. గ్రూప్-2లో భాగంగా బంగ్లాదేశ్తో బుధవారం జరుగనున్న లీగ్ మ్యాచ్లో ధోని సేన తలపడనుంది. రేపు రాత్రి గం.7.30 ని.లకు చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ రెండు మ్యాచ్లు ఆడిన టీమిండియా ఒక గెలుపు మాత్రమే సాధించి కాస్త వెనుకబడింది. సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలంటే బంగ్లాదేశ్పై భారత్కు భారీ విజయం అవసరం. గ్రూప్-2లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకుపోతూ నెట్ రన్ రేట్ పరంగా అగ్రస్థానంలో ఉండగా, ఇదే గ్రూప్లో ఉన్న పాకిస్తాన్ రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి. ఇక భారత్ నాల్గో స్థానంలో ఉంది. మ్యాచ్కు మ్యాచ్కు నెట్ రన్ రేట్ లో మార్పులు చోటు చేసుకోవడం అనివార్యమే అయినా భారత్ పరిస్థితి మాత్రం కాస్త ఆందోళన కరంగానే ఉందనే చెప్పాలి.
దీంతో రేపటి మ్యాచ్లో భారత్ మెరుగైన రన్ రేట్తో బంగ్లాదేశ్ తో గెలవాలి. కాగా, సంచనాలకు మారు పేరైన బంగ్లాదేశ్తో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. సోమవారం జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు బంగ్లా గట్టిపోటీనిచ్చిన సంగతిని ధోని సేన గ్రహించి అందుకు తగిన వ్యూహ రచనతో సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు రెండు వరుస ఓటములతో బంగ్లాదేశ్ దాదాపు సెమీస్ అవకాశాలను కోల్పోయింది. ఈ తరుణంలో బంగ్లాదేశ్ మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో బంగ్లాతో మ్యాచ్ ను టీమిండియా తేలిగ్గా తీసుకోకుండా పూర్తి స్థాయిలో విజృంభించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ధావన్, రైనాల ఫామ్పై ఆందోళన..
ఈ టోర్నీలో ఓపెనర్ శిఖర్ ధావన్, సురేష్ రైనాలు పూర్తి స్థాయిలో ఆడలేదు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ అనవసరపు షాట్లకు పోయి వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో వీరి ఫామ్ పై భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ ఇద్దరి ఆటగాళ్ల వైఫల్యం వల్ల మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడం తమ వల్ల కాదు అన్న చందంగా తయారైంది ఈ ఆటగాళ్ల పరిస్థితి. పేరుకు స్టార్ క్రికెటర్లే అయినా వారు ఆశించిన స్థాయిలో ఆడకపోవటం అభిమానుల్ని సైతం నిరాశకు గురి చేస్తుంది. ఇకనైన వీరు తేరుకుని భారత్ కు చక్కటి పునాది వేస్తేనే మిడిల్ ఆర్డర్ పై భారం తగ్గుతుంది.
వాతావరణం,పిచ్
ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. దీంతో ఏదొక దశలో వర్షం పడే అవకాశం ఉన్నా మ్యాచ్ కు పూర్తి స్థాయిలో అంతరాయం కలగకపోవచ్చు. ఇక పిచ్ విషయానికొస్తే బ్యాటింగ్కు అనుకూలించడం ఖాయంగా కనబడుతోంది. అయితే మొదట్లో పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంది.
భారత జట్టు(అంచనా): మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సురేష్ రైనా, విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అశ్విన్, ఆశిష్ నెహ్రా, బూమ్రా
బంగ్లాదేశ్ జట్టు(అంచనా):మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), మొహ్మద్ మిథున్, సౌమ్య సర్కార్, షబ్బీర్ రెహ్మాన్, షకిబుల్ హసన్, సువగటా హామ్,మొహ్మదుల్లా, ముష్ఫికర్ రహీమ్, సక్లయిన్ సాజిబ్, అల్-అమిన్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్