
'ఈడెన్ గార్డెన్ పిచ్ ను తవ్వేస్తాం'
కోల్కతా: వరల్డ్ టీ 20లో భాగంగా ఈనెల 19వ తేదీన భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్పై ఇంకా నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. మ్యాచ్ వేదిక ధర్మశాల నుంచి కోల్ కతాకు మారినా మరోసారి పాత కథే పునరావృతం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్తో పాకిస్తాన్ మ్యాచ్ ను కోల్ కతాలో జరిగితే పిచ్ ను తవ్వేస్తామంటూ యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(ఏటీఎఫ్ఐ)హెచ్చరించింది. భారత్ పై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడం ఎంతవరకూ సబబని ఏటీఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు విరేష్ షాండిల్యా ప్రశ్నించారు. 'పాకిస్తాన్ జట్టు భారత్ కు వస్తే ఇక్కడి సాహస సైనికులను అవమానపరిచనట్లే. ఈడెన్లో మ్యాచ్ను వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ మ్యాచ్ను జరపాలని తలిస్తే పిచ్ను తవ్వేస్తాం'అని విరేష్ షాండియ్యా హెచ్చరించారు.
దాదాపు పది రోజుల పాటు అనేక మలుపులు తిరిగిన అనంతరం వేదిక మార్పు అంశం బుధవారం ఓ కొలిక్కి వచ్చిన సంగతి తెలిసిందే. ధర్మశాలలో అయితే తాము ఆడటానికి సిద్ధంగా లేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆ వేదికను ధర్మశాల నుంచి కోల్ కతా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ప్రస్తుతం ఏటీఎఫ్ఐ నుంచి తీవ్ర నిరసన గళం వినిపిస్తుండటంతో పాకిస్తాన్ జట్టు వరల్డ్ టీ 20లో పాల్గొనడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.