ఈడెన్ పిచ్ పై ధోని అసంతృప్తి
కోల్ కతా: గతంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్న సమయంలో చాలాసార్లు ఈడెన్ గార్డెన్ పిచ్ తయారీని తప్పుబట్టిన మహేంద్ర సింగ్ ధోని.. తాజాగా మరోసారి ఆ పిచ్ పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో భాగంగా బుధవారం సౌరాష్ట్ర-జార్ఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఇరు జట్లు నమోదు చేసిన మొత్తం స్కోరు 208 పరుగులు కాగా, 52.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దీనిపై పిచ్ క్యూరేటర్ సుజాన్ ముఖర్జీని ధోని ప్రశ్నించాడు. ఆ మ్యాచ్ లో జార్ఖండ్ 42 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ ఆట జరిగిన తీరుపై మాత్రం ధోని తీవ్ర అసృంతప్తిగా ఉన్నాడు.
మ్యాచ్ ముగిసిన తరువాత ఇరు జట్ల ఆటగాళ్ల కరాచలనం కార్యక్రమం తరువాత ధోని నేరుగా క్యూరేటర్ ముఖర్జీ దగ్గరకు వెళ్లాడు. దీనిలో భాగంగా అతనితో ఐదు నిమిషాలు సమావేశమైన ధోని.. పిచ్ చాలా పేలవంగా తయారు చేశారంటూ ప్రశ్నించాడు. ప్రధానంగా 53 ఓవర్లలోపే 20 వికెట్లు పడిపోవడాన్ని క్యూరేటర్ దృష్టికి ధోని తెచ్చాడు.మరొకవైపు జార్ఖండ్ కోచ్ రాజీవ్ కుమార్ కూడా పిచ్ తయారు చేసిన తీరును తీవ్రంగా తప్పుబట్టాడు. ఇదొక పూర్ పిచ్ అంటూ బాహాబాటంగా విమర్శించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ 27.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ కాగా, ఆ తరువాత సౌరాష్ట్ర 25.1 ఓవర్లలో 83 పరుగులకే చాపచుట్టేసింది.
ఇదిలా ఉంచితే, పిచ్ పై వస్తున్న విమర్శలపై క్యూరేటర్ ముఖర్జీ స్పందించాడు. 'ఇక్కడ సీమింగ్ ట్రాక్ ను తయారు చేయమని అడిగారు. దాంతో పిచ్ ను ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలించే విధంగా తయారు చేయాల్సి వచ్చింది. మా గ్రౌండ్ మెన్ పిచ్ ను పూర్తిగా పొడిగా తయారు చేసిన తరువాత నీటితో తడిపి కవర్లతో కప్పి ఉంచారు. ఇలా చేస్తే బంతి బాగా స్వింగ్ అవుతుంది. ఆ క్రమంలోనే తక్కువ స్కోర్ల మ్యాచ్ ను చూడాల్సి వచ్చింది. ఈ పిచ్ తో నేను కూడా సంతృప్తిగా లేను. చాలా ఎక్కువగా సీమ్ కావడంతో పిచ్ పేలవమైనదిగా మారిపోయింది. గతంలో ధోని నుంచి ఎప్పుడూ నాకు ఫిర్యాదు అందలేదు పిచ్ లో తేమ లేకపోవడంతోనే బంతి విపరీతంగా స్వింగ్ అయ్యింది. తదుపరి మ్యాచ్ కు పిచ్ బాగుంటుంది' అని ముఖర్జీ సమర్ధించుకునే యత్నం చేశాడు.