నేను ఇంటికి వెళ్లడానికి సిద్ధం: వకార్
లాహోర్:వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనపై ఆ జట్టు కోచ్ వకార్ యూనస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు మంగళవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి నివేదిక సమర్పించిన వకార్.. జట్టు ప్రదర్శనపై క్షమాపణలు తెలియజేశారు. అనంతరం పాకిస్తాన్ మీడియాతో మాట్లాడిన వకార్.. అసలు తమ జట్టులో లోపాలు ఎక్కడున్నాయన్న దానిపై చర్చించి దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నాడు. దీనికి ఏ ఒక్కర్నో నిందించడం సరికాదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ జట్టులోని అంతర్గత లోపాలపై క్షణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని వకార్ అన్నాడు.
'వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ జట్టు ప్రదర్శన చాలా బాధించింది. జట్టు ప్రదర్శనపై సుదీర్ఘంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అదే క్రమంలో నేను పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాల్సి వస్తే తప్పకుండా వెళతా. పాకిస్తాన్ జట్టులో ఎటువంటి రాజకీయాలు, గ్రూప్ లు లేవు. కేవలం మాది పేలవ ప్రదర్శన మాత్రమే. ఆ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. మా దేశవాళీ క్రికెట్ కూడా చాలా బలహీనంగా ఉంది. మా దేశంలో ఎక్కువ క్రికెట్ ఆడకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. నా భవిష్యత్తును క్రికెట్ తో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. క్రికెట్ అనేది స్టార్స్ గేమ్ అయితే కాదు' అని వకార్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.