2018లో టి20 ప్రపంచకప్ కు సన్నాహాలు!
దుబాయ్: రెండేళ్లకొకసారి జరిగే టి20 ప్రపంచకప్‌ను 2018లో నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్‌తో సీనియర్ అధికారులు చర్చలు జరుపుతున్నారు. స్టార్ స్పోర్ట్స్ తో ఒప్పందం ఖరారైతే ఈ టోర్నీకి వేదికగా దక్షిణాఫ్రికాకు మొదటి అవకాశం ఇవ్వనున్నారు. ఒకవేళ సఫారీలు దీనికి సిద్ధంగా లేకపోతే యూఏఈని వేదికగా ఖరారు చేయాలని భావిస్తున్నారు. 2009లో చాంపియన్స్ ట్రోఫీ జరిగిన తరువాత ఏ రకమైన ఐసీసీ ఈవెంట్ కూడా యూఏఈలో జరగలేదు. మరోవైపు దక్షిణాఫ్రికాలో క్రికెట్ తో పాటు, పలు క్రీడలపై ఆ దేశ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాలో నిర్వహించే ఐసీసీ ఈవెంట్స్ పై సౌతాఫ్రికా క్రికెట్ అక్కడి ప్రభుత్వంతో పరిష్కరించుకునే పనిలో ఉంది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ పెద్దలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు.
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం 2017లో చాంపియన్స్ ట్రోఫీ, 2018లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్, 2019లో వన్డే ప్రపంచకప్, 2020లో టి20 ప్రపంచకప్ ఉన్నాయి. వీటికి అదనంగా 2018, 2022లోనూ టి20 ప్రపంచకప్ నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది.