
బంగ్లాను కుప్పకూల్చిన కివీస్
కోల్కతా: వరల్డ్ టీ 20లో పెద్ద పెద్ద జట్లను సైతం వణికించిన బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు.. తన చివరి లీగ్ మ్యాచ్లో మాత్రం ఘోరంగా చతికిలబడింది. గ్రూప్-2లో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ విలవిల్లాడింది.ఇప్పటికే సెమీస్ కు చేరుకుని మంచి ఊపు మీద ఉన్న కివీలు బంగ్లాను కుప్పకూల్చి 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. తద్వారా టోర్నీలో కివీలు వరుసగా నాల్గో విజయాన్ని దక్కించుకుని లీగ్ దశను ఘనంగా ముగించారు. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 145 పరుగులు నమోదు చేసింది. న్యూజిలాండ్ నికోలస్(7) వికెట్ ను ఆదిలోనే కోల్పోయినా, కెప్టెన్ విలియమ్సన్(42; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతంగా ఆడి జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఆ తరువాత మున్రో(35), రాస్ టేలర్(28) లు మాత్రమే మోస్తరుగా రాణించడంతో న్యూజిలాండ్ సముచిత స్కోరు సాధించింది.
అనంతరం 146 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లా పులులు ఏమాత్రం పోరాడకుండానే చేతులెత్తేశారు.బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్(3), మొహ్మద్ మిథున్(11), షబ్బిర్ రెహ్మాన్(12), షకిబుల్ హసన్(2), సౌమ్య సర్కార్(6),మహ్మదుల్లా(5), ముష్ఫికర్ రహీమ్(0)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆ జట్టు 15.4 ఓవర్లలో 70 పరుగులకే చాపచుట్టేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఎలియట్, సోథీలు చెరో మూడు వికెట్లు సాధించి బంగ్లా పతనాన్ని శాసించగా,సాంట్నార్, మెక్లాన్ గన్, నాథన్ మెకల్లమ్ లు తలో వికెట్ తీశారు.