షాహిద్ ఆఫ్రిదినే టార్గెట్!
కరాచీ:వరల్డ్ టీ 20లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శనకు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదిని బాధ్యుణ్ని చేస్తూ ఆ జట్టు మేనేజర్ ఇంతికాబ్ అలమ్ రూపొందించిన నివేదిక మీడియాకు లీక్ కావడం దుమారం రేపుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ కోచ్ వకార్ యూనస్ అందించిన నివేదిక లీక్ కావడం, అందులో ఆఫ్రిది వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిని సంగతి తెలిసిందే. అయితే వారం వ్యవధిలో ఇంతికాబ్ పీసీబీకి అందజేసిన నివేదికలో కూడా ఆఫ్రిదినే ప్రధానంగా టార్గెట్ చేశారు. ఈ టోర్నీలో ఆఫ్రిది ఎటువంటి ప్రణాళికలు లేకుండా ముందుకు సాగాడని అందులో విమర్శించారు. వరల్డ్ టీ 20లో ఆఫ్రిది 'క్లూలెస్ కెప్టెన్' గా వ్యవహరించడం వల్లే పాక్ జట్టు లీగ్ దశలోనే నిష్ర్కమించినట్లు ఇంతికాబ్ మండిపడ్డారు.
వరల్డ్ టీ 20లో జట్టు చెత్త ప్రదర్శన అనంతరం క్రికెట్ బోర్డు పెద్దలపై విమర్శలు రావడంతో పాటు మీడియాకు లీక్ అవుతున్న నివేదికలతో కలత చెందిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవికి షహర్యార్ ఖాన్ రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే షహర్యార్ కు అత్యంత సన్నిహితుడు, పాకిస్తాన్ క్రికెట్ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీతో పాటు కొంతమంది సీనియర్ అధికారులు నచ్చచెప్పడంతో ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారు.