ఆశలు వదులుకున్నాం:విరాట్
మొహాలి:వరల్డ్ టీ 20లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్లో గెలుస్తామని అసలు అనుకోలేదని టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తాజాగా స్పష్టం చేశాడు. ఆదిలో ముఖ్యమైన వికెట్లను చేజార్చుకున్న తాము.. ఆసీస్ విధించిన లక్ష్యాన్ని ఛేదిస్తామని భావించ లేదన్నాడు. ఒకానొక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించామనే అనుకున్నట్లు విరాట్ పేర్కొన్నాడు.
'ముఖ్యంగా 10.0 ఓవర్లు ముగిసిన తరువాత పరిస్థితి మా చేతుల్లో లేనట్లే ఉంది. దాదాపు ఆశలు వదులు కున్నాం. అయితే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చిన తరువాత మ్యాచ్ మా అధీనంలోకి వచ్చింది. మేము ఏం చేశామన్నది ఆ సమయంలో తెలియదు. బాధ్యతాయుతంగా ఆడాలని మాత్రమే నిర్ణయించుకున్నా. భారత జట్టు కోసం గొప్ప ఇన్నింగ్స్ ఆడటం నిజంగా ఆనందాన్నిచ్చింది. ధోని ఫోర్ తో ఇన్నింగ్స్ ను ముగించిన విధానం చాలా బాగుంది. దానిపై ఏమి మాట్లాడాలో నిజంగా తెలియడం లేదు. మరోసారి ధోని ఫోర్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. అదొక అద్భుతమైన క్షణం'అని కోహ్లి తెలిపాడు. విజయానికి చివరి మూడు ఓవర్లలో 39 పరుగులు కావాల్సిన సమయంలో తాను ఆడిన ఇన్నింగ్స్ ఇంతకు ముందెప్పుడూ ఆడలేదన్నాడు. ఆ సమయంలో కనీసం ఓవర్ కు 15 పరుగులు రాబట్టాలనే కృతనిశ్చయంతో మాత్రమే బ్యాటింగ్ చేసినట్టు పేర్కొన్నాడు.