
'మా క్రికెట్ జట్టులో ఎటువంటి గ్రూపులు లేవు'
మొహాలి:పాకిస్తాన్ క్రికెట్ లో చోటు చేసుకున్న గ్రూపు తగాదాల వల్లే ఆ జట్టు వరుస వైఫల్యాలను చవిచూస్తుందన్న వార్తలను ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ ఖండించాడు. తమ క్రికెట్ జట్టుపై వస్తున్న ఈ తరహా ఊహజనితమైన వార్తలో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. పాక్ క్రికెట్ జట్టు ఓడి పోవడం వల్లే గ్రూపులు ఏర్పాడ్డాయంటూ తమకు వ్యతిరేకంగా కథనాలు రావడం నిజంగా బాధాకరమన్నాడు.
పాక్ క్రికెట్ జట్టులో నైపుణ్యానికి కొదవలేకపోయినా, నిలకడలేమి వల్లే పరాజయం చెందుతున్నట్లు అభిప్రాయపడ్డాడు. 2009 లో వరల్డ్ టీ 20 ట్రోఫీ గెలిచిన పాక్ జట్టులో సగానికి పైగా ఆటగాళ్లు ప్రస్తుత జట్టులో లేకపోవడం కూడా వరుస వైఫల్యాలకు ఒక కారణమన్నాడు. ఆ విషయాన్ని పక్కకు పెట్టి, తమ జట్టు గ్రూపులుగా విడిపోయిందని అనవసరపు రాద్దాంతం చేయడం తగదన్నాడు. తమ సెమీస్ అవకాశాలు పూర్తిగా సమసి పోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఆస్టేలియాతో జరిగే తమ తదుపరి పోరులో గెలవడంపైనే దృష్టి పెట్టినట్లు మాలిక్ తెలిపాడు.పాకిస్తాన్ లో ఇప్పుడు పీఎస్ఎల్(పాకిస్తాన్ సూపర్ లీగ్) ఆరంభమయ్యిందని, మరో రెండు, మూడు సంవత్సరాల్లో ఆ లీగ్ నుంచి నాణ్యమైన క్రికెటర్లు జాతీయ జట్టులోకి వస్తారని మాలిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు.