జింబాబ్వేకు భారీ లక్ష్యం
నాగ్పూర్:వరల్డ్ టీ20లో భాగంగా శనివారం ఇక్కడ జింబాబ్వేతో జరుగుతున్న క్వాలిఫయింగ్ మ్యాచ్లో అఫ్ఘానిస్తాన్ 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్ఘానిస్తాన్ ఆది నుంచి ఎదురుదాడికి దిగి జింబాబ్వేపై ఒత్తిడి పెంచింది. అప్ఘానిస్తాన్ ఓపెనర్ నూర్ అలీ జర్దాన్(10) తొలి వికెట్గా పెవిలియన్కు చేరినా, మరో ఓపెనర్ మొహ్మద్ షెహజాద్(40;23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. అనంతరం అస్ఘర్ స్టానింక్జాయ్(0), గులాబ్దిన్ నాయిబ్(7)లు నిరాశపరచడంతో అప్ఘాన్ 63 పరుగులకే నాలుగు వికెట్లును కోల్పోయింది.
ఆ తరుణంలో షెన్వారీ, మొహ్మద్ నబీల జోడీ అఫ్ఘాన్ స్కోరు బోర్డును ముందుకు కదిలించింది. అయితే షెన్వారీ(43) ఐదో వికెట్ గా పెవిలియన్ చేరడంతో వీరి 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాగా, చివరి ఓవర్లలో పెవిలియన్ కు చేరిన మొహ్మద్ నబీ(52;32 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించడంతో అఫ్ఘాన్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. ఇప్పటికే గ్రూప్- బిలో ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్ లు గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా సూపర్-10 కు అర్హత సాధిస్తుంది.