
'వరల్డ్ కప్ నాటికి ఫిట్ అవుతా'
సిడ్నీ:ఇటీవల పొత్తి కడుపులో నొప్పి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) టోర్నీ నుంచి అర్థాంతరంగా వైదొలిగిన ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వాట్సన్.. వచ్చే వరల్డ్ టీ 20 నాటికి అందుబాటులో ఉంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ కు ఇంకా సమయం ఉన్నందును అప్పటికి ఫిట్ అవుతానని వాట్సన్ తెలిపాడు.
'పాకిస్తాన్ సూపర్ లీగ్ లో భాగంగా వరుసగా మూడు మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. దాంతో కడుపులో సలుపు మొదలైంది. బంతిని ఒక పరిధిలో వేసినా ఆ నొప్పి బాధించింది. దాంతో టోర్నీ నుంచి ఆకస్మికంగా బయటకు రావాల్సి వచ్చింది. అయితే ఇది పెద్ద ప్రమాదం ఏమీ కాదు. అన్ని అనుకున్నట్లు జరిగితే వరల్డ్ కప్ లో ఆడతా'అని వాట్సన్ తెలిపాడు. వరల్డ్ కప్లో వాట్సన్ పాల్గొనడంపై అనుమానస్పదంగా మారిందంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో అతను పైవిధంగా స్పందించాడు. భారత్లో జరిగే వరల్డ్ కప్కు ఇంకా మూడు-నాలుగు వారాలు సమయం ఉన్నందున తన గాయం నుంచి కోలుకునే అవకాశం ఉందన్నాడు.