
'వరల్డ్ టీ 20 టైటిల్ గెలవడమే మా లక్ష్యం'
కోల్కతా:వన్డే ఫార్మాట్ లో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్టేలియాకు టీ 20 వరల్డ్ కప్ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. కాగా, ఈసారి టైటిల్ను సాధించాలనే లక్ష్యంతోనే భారత్లో అడుగుపెట్టామని అంటున్నాడు ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్. ఇప్పటివరకూ పొట్టి ఫార్మాట్లో టైటిల్ గెలవకపోవడం కొరతగా మిగిలిపోయిందన్నాడు. ఈ ఫార్మాట్లో తమ జట్టు బాగానే ఉన్నా ట్రోఫీని మాత్రం చేజిక్కించుకోలేకపోవడం బాధాకరంగా ఉందన్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్ను దక్కించుకోవడానికి తమ శాయశక్తుల కృషి చేస్తామని, అదే లక్ష్యంతో భారత్కు వచ్చినట్లు స్మిత్ స్పష్టం చేశాడు. తమ జట్టులో చాలా మంది క్రికెటర్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆడి ఉండటంతో ఇక్కడ పరిస్థితులు తమ కచ్చితంగా కలిసొస్తాయన్నాడు. ఆసీస్ టాపార్డర్ లో ప్రధాన ఆటగాళ్లైన అరోన్ ఫించ్, ఉస్మాన్ ఖాజా, డేవిడ్ వార్నర్ల బ్యాట్ నుంచి పరుగుల వరద పారడం ఖాయమని స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు.
2005 లో తొలిసారి అంతర్జాతీయంగా ప్రవేశపెట్టిన ట్వంటీ 20 మ్యాచ్ లు అనతికాలంలోనే అమోఘమైన ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీంతో ట్వంటీ 20 వరల్డ్ కప్ ను ప్రవేశపెట్టడానికి ఎంతో సమయం పట్టలేదు. 2007 లో తొలిసారి ట్వంటీ 20 వరల్డ్ కప్ కు శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటివరకూ ఐదు ట్వంటీ 20 వరల్డ్ కప్ లు జరిగినా.. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. 2010లో ఫైనల్ రౌండ్ వరకూ చేరిన ఆస్ట్రేలియా టైటిల్ వేటలో మాత్రం చతికిలబడింది.