ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ అలెక్స్ హేల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెరీర్ పీక్స్‌లో ఉండగా రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ టీ20 వరల్డ్‌కప్-2022 గెలవడంలో కీలకపాత్ర పోషించిన హేల్స్ ఆ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 212 పరుగులు చేశాడు.
హేల్స్ అంతర్జాతీయ కెరీర్‌లో పాక్‌తో చివరి మ్యాచ్ (వరల్డ్‌కప్ ఫైనల్) ఆడాడు. ఆ మ్యాచ్‌లో హేల్స్ (1) విఫలమైనప్పటికీ ఇంగ్లండ్ చిరస్మరణీయ విజయం సాధించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అదే టోర్నీలో భారత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగి 47 బంతుల్లో 86 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రీలంక (47), న్యూజిలాండ్ (52)లతో జరిగిన గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ హేల్స్ చెలరేగిపోయాడు. కెరీర్‌లో 11 టెస్ట్‌లు, 70 వన్డేలు, 75 టీ20లు ఆడిన హేల్స్ 7 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5000కు పైగా పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment