బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు, రంగ్‌పూర్ రైడర్స్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిల్హెట్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 6) జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 56 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హేల్స్ శతక్కొట్టడంతో సిల్హెట్ స్ట్రయికర్స్‌పై రంగ్‌పూర్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిల్హెట్ స్ట్రయికర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. రోనీ తాలుక్‌దార్ (32 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జకీర్ హసన్ (38 బంతుల్లో 50; 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో రాణించారు. జార్జ్ మున్సే 18, పాల్ స్టిర్లింగ్ 16 పరుగులు చేసి ఔట్ కాగా.. ఆఖర్లో ఆరోన్ జోన్స్ (19 బంతుల్లో 38 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), జాకెర్ అలీ (5 బంతుల్లో 20 నాటౌట్; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. రంగ్‌పూర్ రైడర్స్ బౌలర్లలో సైఫుద్దీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్, ఆకిఫ్ జావెద్ తలో వికెట్ దక్కించుకున్నారు.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన రంగ్‌పూర్ రైడర్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. అలెక్స్ హేల్స్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. సైఫ్ హసన్ 49 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు. రంగ్‌పూర్ రైడర్స్ బ్యాటర్లలో హకీమ్ తమీమ్ డకౌట్ కాగా.. ఇఫ్తికార్ అహ్మద్ 8 పరుగులు (నాటౌట్) చేశాడు. సిల్హెట్ స్ట్రయికర్స్ పేసర్ తంజిమ్ హసన్ సకీబ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
ఈ గెలుపుతో రంగ్‌పూర్ రైడర్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచినట్లైంది. పాయింట్ల పట్టికలో రంగ్‌పూర్ రైడర్స్ అగ్రస్థానంలో నిలిచింది. రెండింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఖుల్నా టైగర్స్ రెండో స్థానంలో ఉంది. చిట్టగాంగ్ కింగ్స్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), ఫార్చూన్ బారిషల్ (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం), దర్బార్ రాజ్‌షాహి (3 మ్యాచ్‌ల్లో ఓ విజయం), సిల్హెట్ స్ట్రయికర్స్ (2 మ్యాచ్‌ల్లో 2 పరాజయాలు), ఢాకా క్యాపిటల్స్ (3 మ్యాచ్‌ల్లో 3 పరాజయాలు) వరుసగా మూడు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment